పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజున ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండానే వాయిదా పడ్డాయి. ఇంధనధరల పెంపు, సాగుచట్టాలు సహా పలు అంశాలపై విపక్షసభ్యులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో అంతరాయం కలిగింది.
లోక్‌సభలో వాయిదాల పర్వం..
విపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో వాయిదాల పర్వం నడిచింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. ప్రధాని మాట్లాడటం మొదలుపెట్టగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. చమురు ధరలు, కరోనా ఇతర అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ కల్పించుకుని ప్రతిపక్ష సభ్యులను వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విపక్షసభ్యులు నినాదాలు కొనసాగించగా.. ఆందోళనల మధ్యే ప్రసంగాన్ని కొనసాగించిన మోదీ.. మహిళలు, ఓబీసీలు, రైతుల బిడ్దలు మంత్రులు కావడం కొందరికి ఇష్టం లేదని, అందుకే వారిని సభకు పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు.
ఇటీవల మరణించిన ఎంపీలు, పార్లమెంట్ మాజీ సభ్యులకు లోక్‌సభ సంతాపం ప్రకటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టగా ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగడం వల్ల మరోమారు వాయిదా పడింది.
ఫోన్ ట్యాపింగ్‌పై కీలక ప్రకటన..
కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, పాత్రికేయులు సహా మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలపై కేంద్రం లోక్‌సభలో కీలక ప్రకటన చేసింది. ఈ ఆరోపణలు రావడాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అభివర్ణించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. ప్రస్తుతం దేశంలో ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన నియమనిబంధనలు ఉన్నాయని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. మంత్రి ప్రకటన చేయడం ముగియగానే లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
రాజ్యసభలో..
ఉదయం సభ ప్రారంభమయ్యాక.. చనిపోయిన సిట్టింగ్ ఎంపీలు రఘునాథ్ మహాపాత్ర, రాజీవ్ సతావ్ సహా మరో పది మంది మాజీ ఎంపీలకు రాజ్యసభ సంతాపం తెలిపింది. ప్రముఖ నటులు దిలీప్ కుమార్, పరుగుల వీరుడు మిల్కాసింగ్ మృతిపై సంతాపం వ్యక్తం చేసింది. తర్వాత సిట్టింగ్ ఎంపీలకు సంతాప సూచకంగా గంటపాటు వాయిదా పడింది.
ఆ తర్వాత 12 గంటల 25 నిమిషాలకు సభ ప్రారంభం కాగానే పెట్రో ధరల పెంపు, నూతన సాగుచట్టాలు సహా వేర్వేరు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మొదట రెండింటి వరకు సభ వాయిదాపడింది. తర్వాత సభ ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్రమోదీ నూతన మంత్రులను సభకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో విపక్షాలు ఆందోళన కొనసాగించగా ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తగా మంత్రులైన మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు గౌరవం ఇవ్వకుండా అడ్డుకునేలా విపక్షసభ్యుల వైఖరి ఉందని మండిపడ్డారు.
" మంత్రులుగా నియమితులైన రైతు బిడ్డలను ఈ సభకు పరిచయం చేయాల్సిన సందర్భమిది. కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మహిళా మంత్రులను పరిచయం చేయాల్సి ఉంది. కానీ మహిళా వ్యతిరేక మనస్తత్వం ఉన్నకొందరు మహిళల పేర్లు కూడా వినపడకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. వారిని పరిచయం చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఆదివాసీ మంత్రుల పరిచయం చేయాల్సి ఉంది. దానిని జరగనివ్వడం లేదు. ఇదేం మనస్తత్వం? దళితులకు గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆదివాసీలకు గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. రైతుబిడ్డలకు గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇదేం మనస్తత్వం? ఇలాంటి పరిస్థితిని సభలో తొలిసారిగా చూస్తున్నా."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఈ దశలో మూడింటి వరకు వాయిదాపడిన సభ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగగా.. మంగళవారానికి వాయిదాపడింది.