Opposition No Confidence Motion : మణిపుర్‌పై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీతో ఎలాగైనా మాట్లాడించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న విపక్ష కూటమి 'ఇండియా' కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ప్రధాని మాట్లాడటం సహా తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనేది ఆ కూటమి యోచనగా ఉంది. మంగళవారం ఉదయం సమావేశమైన విపక్షాలు ఈ విషయమై చర్చించాయి. మణిపుర్‌పై పార్లమెంటులో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని.. అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని కూటమి వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నాయని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. ఈ మేరకు డ్రాఫ్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది ఏ మేరకు నిలుస్తుందన్నది ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠగా మారింది.
No Confidence Motion In Lok Sabha : బుధవారం ఉదయం 10 గంటల కంటే ముందే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలనేది విపక్ష కూటమి ఆలోచనగా ఉంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదా సిద్ధమైందని.. 50 మంది ఎంపీలతో సంతకాలు చేయించాల్సి ఉందని కూటమి వర్గాలు తెలిపాయి. 10.30కు పార్లమెంటరీ కార్యాలయంలో హాజరుకావాలని ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. మణిపుర్‌పై కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా పార్లమెంటులో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని 26 ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్ష కూటమి 'ఇండియా'కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. గతంలో 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడం వల్ల అది వీగిపోయింది.
No Confidence Motion Rule 198 : లోక్‌సభలో ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభ విధి విధానాలు, ప్రవర్తనా నియమావళిలోని రూల్ 198 అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే విధానాన్ని నిర్దేశిస్తుంది. ఉదయం 10 గంటలలోపు సభ్యుడు తీర్మానంపై లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. కనీసం 50 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దానిని స్పీకర్ సభలో చదవి తీర్మానంపై చర్చకు తేదీని ప్రకటిస్తారు. తీర్మానాన్ని ఆమోదించిన రోజు నుంచి 10 రోజుల్లోపు చర్చకు తేదీని నిర్ణయించాలి. సభలో ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోలేకపోతే ప్రధాని రాజీనామా చేయాల్సి ఉంటుంది.