Parliament Adjourned Today : పార్లమెంటు వర్షాకాల సమావేశాల రెండోరోజు కూడా వాయిదాలపర్వం కొనసాగింది. లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి వెల్‌లోకు దూసుకెళ్లి.. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు. మణిపుర్ రక్తమోడుతోందంటూ కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. ఆందోళనలతో సమస్య పరిష్కారం కాదని, సంప్రదింపులు, చర్చలతోనే సాధ్యమని స్పీకర్ ఓంబిర్లా ప్రతిపక్ష సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు శాంతించకపోవటంతో స్పీకర్ ఓం బిర్లా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడాలని కోరారు.
ఉప సభా నాయకుడైన రాజ్‌నాథ్ సింగ్ మణిపుర్ ఘటనలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మణిపుర్ పరిస్థితులను సీరియస్‌గా తీసుకోవాలన్న ఆయన ఈశాన్య రాష్ట్రంలో జరిగిన ఘటనలపై దేశమంతా సిగ్గుతో తలదించుకుందని ప్రధాని మోదీ స్వయంగా వ్యాఖ్యానించటం వల్ల ఈ అంశాన్ని ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో అర్థమవుతోందన్నారు. మణిపుర్ ఘటనలపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని, ఆ విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పటమే కాకుండా ఇప్పుడు సభలోనూ చెబుతున్నట్లు రాజ్‌నాథ్ తెలిపారు.