Parliament Monsoon Session 2023 : కొత్త మిత్రులు, సరికొత్త పొత్తులతో అధికార, ప్రతిపక్ష కూటములు బలాన్ని కూడదీసుకుంటున్న తరుణంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరస్పరం ఇరుకునపెట్టే వ్యూహాలకు రెండు శిబిరాలూ పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మణిపుర్ అల్లర్లపై ప్రధాని నరేంద్రమోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడాలని విపక్షాలు భావిస్తున్నాయి.
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం! - పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బిల్లులు
Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. మణిపుర్, దిల్లీ ఆర్డినెన్స్, ఉమ్మడి పౌర స్మృతి-యూసీసీపై ఉభయ సభలు దద్దరిల్లనున్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి గురువారం తొలి సమావేశం నిర్వహిస్తోంది.
ఉమ్మడి పౌర స్మృతి, దిల్లీ ఆర్డినెన్సు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్లు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, సరిహద్దులో పరిస్థితులు వంటి ఇతర అంశాలూ చర్చకు వచ్చేలా చూడాలని, దానిపై వ్యూహరచనకు ప్రతిరోజూ సమావేశం కావాలని ప్రతిపక్ష శిబిరం నిర్ణయించింది. ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో కొనసాగే సమావేశాల్లో 32 అంశాలను సభల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తొలిరోజు నుంచి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిల్లీ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు సమర్పించిన నోటీసులను లోక్‌సభ సచివాలయం అనుమతించింది. కొత్తగా ఏర్పాటైన విపక్ష కూటమి ఇండియా నేడు తొలిసారి సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని చర్చించడానికి రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో భేటీ నిర్వహించనున్నారు.
Parliament Monsoon Session Agenda : బుధవారం అఖిలపక్ష సమావేశానికి 34 పార్టీల నేతలు హాజరై తమ డిమాండ్లను వినిపించారు. మణిపుర్ పరిస్థితులపై మొదటిరోజే ప్రధానమంత్రి ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. కులగణన, ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి అంశాలపై.. చర్చ గురించి వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. మణిపుర్ అంశంపై చర్చకు సభాపతి ఎప్పుడు తేదీ నిర్ణయిస్తే అప్పుడు చర్చిస్తామని, ప్రధానమంత్రి ప్రకటన కోసం విపక్షాలు డిమాండ్ చేయడం సభలో గందరగోళం సృష్టించడానికి ఒక సాకు మాత్రమేనని చెప్పారు.