Lok Sabha Monsoon Session 2023 : పార్లమెంటులో మణిపుర్ మంటలు కొనసాగుతున్నాయి. వర్షాకాల సమావేశాల ఈనెల 20న ప్రారంభం కాగా.. తొలిరోజు నుంచి మణిపుర్ అంశంపై లోక్‌సభ, రాజ్యసభ.. విపక్షాల నినాదాలతో హోరెత్తుతున్నాయి. ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయడం సహా మణిపుర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాయి. శుక్రవారం ఉదయ లోక్‌సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానంపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ.. విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు.
ఈ తరుణంలోనే ఎంతో కీలకమైన ప్రశ్నోత్తరాలను అనుమతించాలని కోరుకోవడం లేదా అని స్పీకర్ ప్రశ్నించారు. 1978 మే 10న పెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ అనుమతించిన వెంటనే చర్చ జరిగిందని.. కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి గుర్తుచేశారు. అయితే 10 రోజుల్లోపు అవిశ్వాసంపై ఎప్పుడైనా చర్చించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు నిరసన కొనసాగించగా.. తొలుత మధ్యాహ్నం 12గంటలకు, తర్వాత కొద్దిసేపు చర్చ అనంతరం సోమవారానికి సభ వాయిదా పడింది.
రాజ్యసభలోనూ విపక్ష సభ్యుల నిరసనతో ఎలాంటి చర్చ జరగలేదు. మణిపుర్ అంశంపై చర్చించాలని విపక్షాలకు చెందిన 47 మంది ఎంపీలు నోటీసులు ఇవ్వగా.. స్వల్పకాలిక చర్చకు అంగీకరిస్తున్నానని ఛైర్మన్ జగదీప్ ధన్‌కఢ్ అన్నారు. ప్రశ్నోత్తరాలు కూడా ఎంతో ముఖ్యమని వివరించారు. ఆ విషయాలు తమకు తెలుసునని, విపక్షాలు ఇచ్చిన నోటీసులపై చర్చ జరగాలని తృణమూల్ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ అన్నారు. ఈ క్రమంలో ఓబ్రెయిన్ తీరుపై ఛైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌పై కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఓబ్రెయిన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు.
'సభలో బలముంటే బిల్లులు అడ్డుకోండి'
Manipur Issue In Lok Sabha : శుక్రవారం కూడా లోక్‌సభలో శాసన వ్యవహారాలను విపక్ష సభ్యులు అడ్డుకోవడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ప్రతిపక్షాలకు సభలో సరైన బలం ఉందని భావిస్తే.. బిల్లులను అడ్డుకోవాలన్నారు. అవిశ్వాస తీర్మానంపైనే ప్రతిపక్షాలు చర్చ జరపాలని పట్టుబట్టడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభలో అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉండగా శాసన వ్యవహారాలను ఎలా జరుపుతారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సభ కార్యక్రమాలు జరగకూడదనే విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. వారికంత బలమే ఉంటే సభలో బిల్లులను ఓడించాలని ఆయన సవాల్ విసిరారు.
ఇదిలా ఉండగా.. ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు ఈ వారాంతంలో మణిపుర్ వెళ్లి.. అక్కడి కలహాల బాధితులను పరామర్శించాలని భావిస్తున్నారు. వీటిపై స్పందించిన ప్రహ్లాద్ జోషి.. వారిని వెళ్తే వెళ్లనివ్వండని వాఖ్యానించారు. మణిపుర్ ఘటనపై సభలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 'ప్రతిపక్షాలు మాట్లాడాలి, నిజం బయటకు రావాలి అనుకుంటే సభ కంటే మంచి స్థలం మరొకటి లేద'న్నారు.