Parliament banning protests: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కీలక నిర్ణయం వెలువడింది. పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు అనుమతి ఉండదంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు.
'ధర్నా, ప్రదర్శన, నిరాహార దీక్ష, సమ్మె, ఏదైనా మతపరమైన వేడుక కోసం సభ్యులు పార్లమెంట్ ఆవరణను వినియోగించకోలేరు. ఇందుకు సభ్యులు సహకరించాలని కోరుతున్నాను' అంటూ ఆ లేఖలో పీసీ మోదీ పేర్కొన్నారు. తాజా ఆదేశాలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శలు చేశారు. 'విశ్వగురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక ధర్నాపై నిషేధం' అంటూ విరుచుకుపడ్డారు.
కూర్చుని చర్చిస్తాం: మరోవైపు రాజ్యసభ సెక్రటరీ చేసిన ప్రకటనపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో ఎలాంటి పరిమితులు విధించలేదని.. స్పీకర్ వద్ద నుంచి తమకు సమాచారం అందిందన్నారు. ఈ విషయంపై దిల్లీలో రేపు అన్ని రాజకీయ పార్టీల నేతల కూర్చుని చర్చిస్తామని ఆయన తెలిపారు.
జులై 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో .. ఇప్పటికే లోక్‌సభ నిషేధిత పదాల జాబితాను విడుదల చేసింది. వాటిలో అవినీతిపరుడు, సిగ్గుచేటు, డ్రామా, జుమ్లాజీవి, పిరికివాడు, చీకటి రోజులు, అహంకారి వంటి పలు పదాలను వాడకూడదని పేర్కొంది. అయితే పదాల జాబితాపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత సాధారణంగా ఉపయోగించే పదాలను కూడా మాట్లాడొద్దని చెప్పడం సరికాదంటూ మండిపడ్డారు.