Parliament Building Security :పార్లమెంట్ దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న నిలువెత్తు ప్రజాస్వామ్య దేవాలయం. దేశంలోని అత్యంత భద్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. అలాంటి పార్లమెంట్‌లో బుధవారం జరిగిన ఘటన భద్రతా వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్ భారతం ఉలిక్కిపడింది. అప్పటి నుంచి పార్లమెంట్‌లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ఆంక్షలు విధించారు.
విజిటర్స్ పాస్ తప్పనిసరి
ప్రస్తుతం ఎంపీలు, సరైన గుర్తింపు కార్డు కలిగిన అధికారులు, జర్నలిస్టులు, టెక్నీషియన్లు, పనివారు మినహా పార్లమెంట్‌లోకి ఎవరికీ అనుమతి లేదు. సందర్శకులు రావాలంటే తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యుల ద్వారా సెక్యూరిటీ క్లియరెన్స్ పొంది విజిటర్స్ పాస్‌లు తీసుకోవాలి. సందర్శకుల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఈ పాస్‌ల జారీ చేస్తారు. వీరి ప్రవర్తనకు పూర్తి బాధ్యత ఆయా పార్లమెంట్ సభ్యులదే.
మూడంచెల భద్రతా వ్యవస్థ
పార్లమెంట్ భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్‌కు వచ్చే సిబ్బంది, విజిటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద, రెండోసారి భవనం వద్ద, చివరగా విజిటర్స్ గ్యాలరీ వెళ్లే మార్గంలోని కారిడార్‌లో తనిఖీలు చేస్తారు.