Parliament budget session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు సభలు ఒకేసారి భేటీ కానున్నాయి. కరోనా నిబంధనలకు లోబడి సమావేశాలు నిర్వహించనున్నారు.
budget session second phase
ఈ విడతలో పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వంటి కీలక అంశాలపై.. చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు నిర్ణయించాయి.
ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ బృందం దిల్లీలో భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కె.సురేశ్, జైరామ్ రమేశ్ హజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు కె. సురేశ్ తెలిపారు.