రాజ్యసభ మార్చి 13కు వాయిదా పడింది. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య సభను వాయిదా వేస్తున్నట్లు పెద్దల సభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణపై దర్యాప్తుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సభ్యులు ఆందోళన చేశారు. ఛైర్మన్ ఎంతగా వారించినా సభ్యులు మాట వినలేదు. ఓ దశలో విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ఎంపీలు రాఘవ్ చడ్ఢా, సంజయ్ సింగ్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, శక్తి సింగ్ గోహిల్, సందీప్ పట్నాయక్, కుమార్ కేట్కర్ను సభాపతి హెచ్చరించారు. ఈ క్రమంలోనే సభను స్వల్ప సమయం పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పటికీ.. విపక్ష ఎంపీలు శాంతించలేదు.
ఆగని విపక్షాల ఆందోళన.. వచ్చే నెలకు వాయిదా పడ్డ రాజ్యసభ - budget session 2023
విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ మార్చి 13కు వాయిదా పడింది. ఎంపీలు కావాలనే సభా కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సభను వచ్చే నెలకు వాయిదా వేసిన ధన్‌ఖడ్.. విపక్ష ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు కావాలనే సభకు ఆటంకం కలిగిస్తున్నారని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. 'సభను ఇలా నడపలేం. ఇప్పటికే చాలా సమయం వృథా చేశాం. ఇలాగే సభకు ఆటంకం కలిగిస్తూ ఉంటే.. ప్రజల ఆకాంక్షల మేరకు కఠినంగా నడుచుకోవాల్సి వస్తుంది' అని ధన్‌ఖడ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ధన్‌ఖడ్. 'ఛైర్మన్‌పై ఒత్తిడి ఉందని మీరు (విపక్షనేత ఖర్గేను ఉద్దేశించి) అంటున్నారు. ఎవరి ఒత్తిడితోనో నేను అలా పనిచేస్తున్నారని ప్రతిసారి మీరు చెబుతున్నారు. అది సరికాదు. ఈ పదాలను రికార్డుల్లో నుంచి తొలగించాం. సభ సజావుగా జరిగేలా చూడాలన్న బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు' అంటూ ఖర్గేకు ధన్‌ఖడ్ చురకలు అంటించారు.
మరోవైపు, లోక్‌సభలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మార్చి 13న బడ్జెట్ రెండో దఫా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ మళ్లీ సమావేశం కానుంది.