తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్నికైన ప్రభుత్వాలను 90సార్లు కూల్చారు.. NTR విషయంలోనూ అంతే' - పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

కొన్ని రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం భారీగా అప్పులు చేయటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలను చూసిన తర్వాతైనా అప్రమత్తం కావాలని హితవు పలికారు. లేకుంటే ఆయా రాష్ట్రాలతోపాటు దేశం కూడా నాశనం అవుతుందని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానంలో హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసిన మోదీ ఆర్టికల్‌ 356ను దుర్వినియోగం చేసి 50 ప్రభుత్వాలను కూలగొట్టారని మండిపడ్డారు. 9 ఏళ్ల ఎన్డీఏ హయంలో వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మోదీ చెప్పారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది.

pm Narendra modi speech
నరేంద్ర మోదీ

By

Published : Feb 9, 2023, 3:41 PM IST

Updated : Feb 9, 2023, 6:47 PM IST

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో సమాధానం ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. 60ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను ఎండగట్టారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రయత్నించలేదని, కేవలం కొందరితోనే సరిపెట్టేదని విమర్శించారు. దేశాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తూ 6దశాబ్దాలు వృథా చేయగా.. అదే సమయంలో చిన్నచిన్న దేశాలు అభివృద్ధిపథంలో దూసుకెళ్లాయని చురకలు అంటించారు. తమ ప్రభుత్వం మాత్రం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా విధానాల రూపకల్పనలో నిమగ్నమైందని తెలిపారు.

అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటు కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తుండగానే ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగించారు. కొందరు సభ్యుల భాష, వ్యవహారశైలి నిరాశ చెందేలా ఉందని, అలాంటివారి చర్యల వల్ల భాజపా మరింత వికసిస్తుందన్నారు. కొన్ని రాష్ట్రాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ తర్వాత తరాలను అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పుడు దేశంలో ఆర్థిక విధానాల గురించి పట్టింపులేదు. 24గంటలూ రాజకీయాలు తప్ప మరొకటి ఆలోచించరు. వారు అర్థనీతి నుంచి అనర్థ నీతిగా మార్చారు. వారికి నేను హెచ్చరిక చేస్తున్నాను. తప్పుడు దారుల్లో వెళ్లవద్దు. ఎందుకంటే మన పొరుగుదేశాలను చూస్తున్నాం. అడ్డగోలుగా అప్పులు చేసి దేశాలను ముంచారు. ఇప్పుడు మనదేశంలోనూ తాత్కాలిక ప్రయోజనాల కోసం చూస్తే వచ్చేతరం ఆ బాధలు అనుభవిస్తుంది. మనమైతే అప్పులు చేద్దాం.. తర్వాత వచ్చేవారు చూసుకుంటారు అన్నట్లుగా కొన్ని రాష్ట్రాలు ప్రవర్తిస్తున్నాయి. అది వారితోపాటు దేశాన్నీ నాశనం చేస్తుంది. దేశ ఆర్థిక ప్రయోజనాలు, రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితి విషయంలో క్రమశిక్షణ మార్గాన్ని ఎంచుకోవాల్సిందే. రెండుపూటల రోటి కోసం కన్న కలను మీరు పరిష్కరించలేదు. కానీ మేం పరిష్కరించాం. ఎవరికి సామాజిక న్యాయం ఆకాంక్ష ఉండేదో.. దాన్ని మీరు పరిష్కరించలేదు. కానీ మేం పరిష్కరించి చూపాం. ఇది దేశం చూస్తోంది. ఒక వ్యక్తి వారికి మింగుడుపడటం లేదు. నినాదాలు చేయటానికి కూడా ఒకరి తర్వాత ఒకరు మార్చుకోవాల్సి వచ్చింది. వారు అడ్డంకులు సృష్టించినా గంటకుపైగా సమాధానం ఇచ్చా. గౌరవ ఛైర్మన్‌ దేశం కోసం జీవిస్తాను. దేశం కోసం ఏదో చేయాలని బయలుదేరాను. అందుకే రాజకీయాలు చేసేవారికి విశ్వాసం లేదు. వారు బతకటానికి దారులు వెతుకుతున్నారు.

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇదేసమయంలో కాంగ్రెస్‌పై విమర్శల దాడిని మరింత పెంచిన మోదీ.. ఆర్టికల్‌ 356ను దుర్వినియోగంచేసి అనేకరాష్ట్రాల్లో వైరిపక్షాల ప్రభుత్వాను కూలగొట్టిందని ధ్వజమెత్తారు.

ఆర్టికల్‌ 356ను అందరికంటే ఎక్కువగా దుర్వినియోగం చేశారు. 90సార్లు ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టారు. ఒక ప్రధానమంత్రి ఆర్టికల్‌ 356ను 50సార్లు ఉపయోగించారు. ఆమె పేరు ఇందిరాగాంధీ. ఆమె 50సార్లు ప్రభుత్వాలను కూలగొట్టారు. అన్ని ప్రాంతాల నేతలను ఆమె ఇబ్బందులకు గురిచేశారు. ఎన్టీఆర్‌ విషయంలోనూ ఏం చేశారో ఓసారి చూద్దాం. ఇక్కడున్న వారిలో కొంతమంది వారి వస్త్రాలు మార్చుకొని ఉండొచ్చు, పేరు మార్చుకొని ఉండొచ్చు, జ్యోతిష్యుల సూచన మేరకు పేరు మార్చుకొని ఉండొచ్చు. కానీ వారు కూడా ఒకప్పుడు ఆయన వెంటే ఉన్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య సమస్యలపై అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఇది కాంగ్రెస్‌ రాజకీయ నీతి.

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

2047లో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలన్నది దేశ ప్రజల సంకల్పమని చెప్పిన ప్రధాని మోదీ.. ఇప్పుడు దేశం వెనక్కి తిరిగి చూసేందుకు సిద్ధంగా లేదని, సుదూర ప్రయాణం చేసేందుకు ఉత్సాహంగా ఉందన్నారు. 9ఏళ్ల ఎన్డీయే హయాంలో 60ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో చేయని ఎన్నో పనులు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత ఎన్డీయే సభ్యులు మోదీ అంటూ నినాదాలు చేయడం సహా కరళతాళధ్వనులు చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష ఎంపీలు కూడా పోటీగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.

Last Updated : Feb 9, 2023, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details