తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​లో వాయిదాల పర్వం.. ఈడీ ఆఫీస్​కు విపక్షాల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు - పార్లమెంట్ బడ్జెట్ వార్తలు

పార్లమెంట్​లో ప్రతిష్టంభన వీడడం లేదు. అధికార, విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి.

parliament budget session 2023
parliament budget session 2023

By

Published : Mar 15, 2023, 11:21 AM IST

Updated : Mar 15, 2023, 4:16 PM IST

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ అధికారపక్ష ఎంపీలు నినాదాలు చేయడం, ఇందుకు దీటుగా హస్తం పార్టీ సభ్యులు ఆందోళన చేయడం వల్ల ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్​సభ ప్రారంభం కాగా.. మొదటి నుంచీ సభ్యులు నినాదాలతో సభకు ఆటంకం కలిగించారు. దీంతో నాలుగు నిమిషాల వ్యవధిలోనే సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి భేటీ కానున్నట్లు తెలిపారు. అయితే, సభ్యులు మధ్యాహ్నం సైతం ఆందోళనలను విరమించలేదు. దీంతో గురువారానికి సభ వాయిదా పడింది.

రాజ్యసభలోనూ పరిస్థితి అలాగే కొనసాగింది. ప్రారంభంలో సభా కార్యకలాపాలు సజావుగానే సాగినప్పటికీ.. కొద్దిసేపటికే భాజపా ఎంపీలు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 7 వాయిదా తీర్మానాలు వచ్చాయని ఛైర్మన్ జగ్దీప్ ధన్​ఖడ్ పేర్కొనగానే.. అధికార పార్టీ సభ్యులు కాంగ్రెస్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా విపక్ష ఎంపీలు సైతం నినాదాలు చేయడం వల్ల.. సభలో గందరగోళం తలెత్తింది. దీంతో మొదట మధ్యాహ్నం రెండు గంటలకు, ఆ తర్వాత గురువారానికి పెద్దల సభ వాయిదా పడింది.

'క్షమాపణ చెప్పేది లేదు'
అయితే.. యూకేలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే అవకాశమే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్​ను విమర్శిస్తున్న వారు గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'మోదీ ఐదారు దేశాలకు వెళ్లి భారత ప్రజలను అవమానించారు. భారత్​లో పుట్టడం పాపం అని అన్నారు. దానిపై ముందుగా వారు సమాధానం చెప్పాలి. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం నశిస్తోంది. టీవీ ఛానెళ్లపై ఒత్తిడి నెలకొంది. నిజం మాట్లాడిన వారిని జైళ్లలో పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అంతం కాదా?' అని ప్రశ్నించారు ఖర్గే.

ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు
అదానీ గ్రూప్​పై హిండెన్​బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేయాలంటూ ఈడీని కోరాయి విపక్షాలు. ఈ మేరకు ఈడీ డైరెక్టర్​ ఎస్​కే మిశ్రాకు లేఖ రాశాయి ప్రతిపక్షాలు. ఈ లేఖపై కాంగ్రెస్​, డీఎంకే, ఆప్​, వామపక్షాలు సహా వివిధ పార్టీలు సంతకం చేశాయి. అంతకుముందు పార్లమెంటు నుంచి ఈడీ కార్యాలయానికి విపక్షాలు తలపెట్టిన ర్యాలీని దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున విపక్ష నేతలు వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు.

అదానీ గ్రూప్ విషయంలో హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు చేయాలని ఈడీ అధికారులను కోరేందుకు ఈ ర్యాలీ చేపట్టాయి విపక్షాలు. ఎన్సీపీ, టీఎంసీ పార్టీలు ఈ ర్యాలీలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. అదానీ గ్రూపు విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ-JPC వేయాలని కోరుతున్నా.. కేంద్రం పట్టించుకోవడంలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించాయి. విపక్ష ఎంపీలు ప్లకార్డులు తీసుకుని బయలుదేరగా విజయచౌక్‌లో భారీగా మోహరించిన పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. 200 మంది ఎంపీలను 2,000 మంది పోలీసులతో అడ్డుకుని విపక్షాల గొంతును కేంద్రం నొక్కేస్తుందని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జేపీసీ వేసేందుకు సిద్ధంగా లేనివారు.. శాంతియుత ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్​తో కలవలేం: టీఎంసీ
అంతకుముందు.. పార్లమెంట్ బయట విపక్షాలు మళ్లీ విడివిడిగా ఆందోళనలు కొనసాగించాయి. సమావేశాలు సజావుగా జరకపోవడం బాధాకరమని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ పేర్కొన్నారు. అధికార పార్టీతో పాటు, ప్రధాన విపక్షం సైతం సభలో ఆందోళన చేస్తోందని అన్నారు. అందుకే టీఎంసీ ఎవరితో కలవకుండా ఆందోళన చేస్తోందని చెప్పారు. 'ఇతర పార్టీలతో మేం నిరసనల్లో పాల్గొనడం లేదు. నిరసనలే కాదు పార్లమెంట్​లో అనుసరించే అజెండాను సైతం టీఎంసీ సొంతంగా ఫాలో అవుతుంది. మా (బంగాల్) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. భాజపా, సీపీఎంతో కలిసి పనిచేస్తోంది. అందుకే కాంగ్రెస్ నేతలు పెట్టే సమావేశాలకు మేం వెళ్లలేం' అని సుదీప్ స్పష్టం చేశారు.

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్​బర్గ్ రీసెర్చ్.. అదానీ గ్రూప్​పై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ నివేదిక విడుదల చేసింది. అదానీ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారని ఆరోపించింది. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి.. అకౌంటింగ్ మోసాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ ఖండించింది. ఇది భారత్​పై చేసిన దాడి అని దీటుగా బదులిచ్చింది. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Last Updated : Mar 15, 2023, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details