తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ వ్యాఖ్యలపై ఆగని రగడ.. కాంగ్రెస్​ నేతపై నడ్డా 'టూల్​ కిట్​' పంచ్ - పార్లమెంట్​లో అదానీ వ్యవహారం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ లండన్​లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పార్లమెంట్​లో బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రతిగా కాంగ్రెస్​ నేతలు కూడా ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో ఉభయసభలు మార్చి 20కి వాయిదా పడ్డాయి.

parliament budget session 2023
parliament budget session 2023

By

Published : Mar 17, 2023, 11:40 AM IST

Updated : Mar 17, 2023, 12:48 PM IST

రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మార్చి 13న ప్రారంభమైన పార్లమెంట్​ రెండో దశ బడ్జెట్​ సమావేశాలు ఆరోజు నుంచి వాయిదా పడుతూనే ఉన్నాయి. శుక్రవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షనేతలు అదానీ వ్యవహారంలో చర్చ జరపాలని కోరగా.. బీజేపీ సభ్యులు రాహుల్​ లండన్​ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. విదేశాల్లో రాహుల్​ మాట్లాడిన ఆ మాటలు భారత ప్రతిష్ఠతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఇందుకు ధీటుగా కాంగ్రెస్ సభ్యులు ఆందోళనలకు దిగారు. సభ సజావుగా జరిగేలా చూడాలని రాజ్యసభ ఛైర్మన్​ జగదీప్​ ధన్​ఖడ్​, లోక్​ సభ స్పీకర్​ ఓం బిర్లా చేసిన విజ్ఞప్తులను సభ్యులు పట్టించుకోకుండా ఆందోళన చేపట్టారు. దీంతో రెండు సభలను మార్చి 20కి వాయిదా పడ్డాయి.

రెండో దశ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమై నుంచి సభ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం విశేషం. ప్రస్తుతం అదానీ వ్యవహారంపై జాయింట్​ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు పార్లమెంట్​ ఆవరణంలో నిరసనకు దిగాయి. ఈ ఆందోళనల్లో కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్​ గాంధీ పాల్గొన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన జేపీ నడ్డా
రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రాహుల్ గాంధీ లండన్​ చేసిన వ్యాఖ్యలకు కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్​ చేశారు. రాహుల్​ గాంధీ విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యం నశించిదని చెప్పడం సిగ్గుచేటని నడ్డా అన్నారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం కోరడం వెనక రాహుల్ గాంధీ ఉద్దేశమేంటని ప్రశ్నించారు. దేశం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏ నేత విదేశాల్లో ఇలా కోరలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు. రాహుల్‌ గాంధీ ఇప్పుడు దేశ వ్యతిరేక 'టూల్‌కిట్‌'లో శాశ్వత సభ్యుడిగా మారారు అని అన్నారు.

అప్పటి నుంచి అదే కథ..
మార్చి 13న రెండో విడత బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​.. లండన్​లో రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై రాహుల్​ చేసిన వ్యాఖ్యలకు సభా ముఖంగా క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి కోరారు. రాహుల్​ గాంధీ లండన్​లో భారతదేశ పరువు తీశారని రాజ్​నాథ్​ సింగ్​ ఆరోపించారు. "రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న రాహుల్ యుకేలో భారత్​ తీవ్రంగా అవమానించారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులందరూ ఖండించాల్సి ఉంది. రాహుల్​ సభా ముఖంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను" అని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. రాహుల్ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరారని ఆరోపించారు. రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతోపాటుగా ప్రస్తుతం భారత్​లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని.. మరింత బలపడుతుందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మార్చి 13న ప్రారంభమైన రాహుల్ వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి.

Last Updated : Mar 17, 2023, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details