పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలోనూ అదే తీరు కనిపిస్తోంది. సభలో ఎంపీలు ఆందోళనలు చేయడం వల్ల లోక్‌సభ వాయిదా పడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ఖండిస్తూ లోక్‌సభలో మాట్లాడారు. అయితే, ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మరోవైపు, రాజ్యసభలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్దల సభ సైతం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అయితే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత సమావేశమైన పార్లమెంట్ ఉభయ సభల్లో మళ్లీ అదే గందరగోళం తలెత్తింది. దీంతో రెండు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇటీవలే రాహుల్ గాంధీ లండన్‌లో జరిగిన ఓ సెమినార్లో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి కోరారు. లండన్‌లో భారతదేశ పరువు తీశారని ఆయన ఆరోపించారు. "ఈ సభలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ లండన్‌లో భారత్‌ను అవమానించారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులందరూ ఖండించాలి. రాహుల్ సభా ముఖంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను" అని రక్షణ మంత్రి అన్నారు. రాహుల్ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరారని ఆరోపించారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో పాటుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రస్తుతం భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని.. మరింత బలపడుతుందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
దీంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. లోక్‌సభలోని వెల్లోనికి దూసుకెళ్లారు. దీంతో గందరగోళం చెలరేగడం వల్ల స్పీకర్ ఓంబిర్లా.. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అయితే, కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నవారే.. దాన్ని కాపాడాలని మాట్లాడుతున్నారని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. భోజన విరామం అనంతరం ప్రారంభమైన సభలో మళ్లీ ఇదే విషయంపై గందరగోళ పరిస్థితి నెలకొనగా.. రెండు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.