తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉభయ సభల్లో అదే రగడ- కీలక బిల్లులకు ఆమోదం - retro tax bill

విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటులో కీలక బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో మూడు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అన్ని బిల్లులు మూజువాణి ఓటుతోనే గట్టెక్కాయి. మరోవైపు, లోక్​సభలో రెట్రో ట్యాక్స్​ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.

Air quality Bill, parliament proceedings today
గందరళగోళం మధ్య కీలక బిల్లులకు ఆమోదం

By

Published : Aug 5, 2021, 8:36 PM IST

Updated : Aug 5, 2021, 10:02 PM IST

గందరగోళ పరిస్థితుల మధ్య పార్లమెంటులో గురువారం పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. కేంద్రం ప్రవేశపెట్టిన అత్యవసర రక్షణ సేవల బిల్లు, ఎయిర్​ క్వాలిటీ బిల్లు, షెడ్యూల్డ్​ ట్రైబ్స్​ చట్ట సవరణ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయి. ఇవన్నీ మూజువాణి ఓటుతోనే గట్టెక్కాయి. మరోవైపు, లోక్​సభలో కేంద్రం రెట్రో ట్యాక్స్​ బిల్లును ప్రవేశపెట్టింది.

ఎస్​టీలకు న్యాయం చేస్తుంది..

షెడ్యూల్డ్​ ట్రైబ్స్​ చట్టం సవరణ బిల్లుతో ఎస్​టీలకు న్యాయం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్​ ముండా పేర్కొన్నారు. అరుణాల్​ప్రదేశ్​ ప్రభుత్వం సూచనల మేరకు చట్టంలోని గిరిజన తెగలకు సంబంధించి మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. నోక్టే, టాంగ్సా, టుట్సా, వాంచో, మోన్పా, మెంబా, సార్టాంగ్​, సాజోలాంగ్​ తెగల పేర్లను చేరుస్తున్నట్లు తెలిపారు. ఖంప్తీ తెగ పేరును తాయ్​ ఖంప్తీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఆది, అబోర్​ తెగలు ఒకటే కావడం వల్ల చట్టంలోంచి అబోర్​ తెగ పేరును తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఎయిర్​ క్వాలిటీ బిల్లు..

దిల్లీ సహా శివారు ప్రాంతాల్లో వాయు కాలుష్య కట్టడికి కమిషన్​ ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్రం ఎయిర్​ క్వాలిటీ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల నిరనసల మధ్య మూజువాణి ఓటుతో రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అంతకుముందు.. బుధవారం ఈ బిల్లు లోక్​సభలో ఆమెదం పొందింది.

'వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. కాలుష్యానికి కారకులైన వారికి శిక్ష విధించే సెక్షన్​ 14ను సడలిస్తున్నాము' అని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్​ యాదవ్​ తెలిపారు.

విపక్షాల నిరసనలపై స్పందిస్తూ.. ఈ బిల్లు వాయు కాలుష్యానికి సంబంధించినదని, కానీ సభలో శబ్ద కాలుష్యమే ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది ఏప్రిల్​లో అమలు చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఆ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.

అత్యవసర రక్షణ సేవల బిల్లు..

కేంద్రం ప్రవేశపెట్టిన అత్యవసర రక్షణ సేవల బిల్లు ద్వారా సంబంధిత యూనిట్లలోని ఉద్యోగుల తొలగింపు, నిరసనల కట్టడి, లాకౌట్​లు ప్రభుత్వ అధీనంలోకి రానున్నాయి. జూన్​లో ప్రవేశపెట్టిన ఆర్డినెన్సు స్థానంలో ఈ బిల్లును చేర్చనున్నారు. లోక్​సభలో మంగళవారం ఈ బిల్లు ఆమోదం పొందింది.

ఆయుధ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోందని.. అందుకే ప్రైవేటీకరణ ద్వారా సంస్కరణలు చేపట్టనున్నట్లు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. ఈ బిల్లు ఒక్క ఏడాది మాత్రమే అమలులో ఉంటుందని.. ఆ తర్వాత దానిని కొనసాగించాలంటే ప్రభుత్వం దానిని పురుద్ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ బిల్లుపై యూనియన్లతో చర్చించామని.. ఉద్యోగులకు ఎలాంటి హాని కలగదని రాజ్​నాథ్​ తెలిపారు. శాంతియుత నిరసనలకు ఈ బిల్లు అడ్డంకి కాదన్నారు.

రెట్రో ట్యాక్స్​ బిల్లు..

రెట్రోస్పెక్టివ్ పన్ను వసూలు విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం లోక్​సభలో పన్ను చట్టాల సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలన్నది కేంద్రం ప్రతిపాదన.

పాత తేదీల నుంచి పన్ను వసూలు చేసే పద్ధతినే రెట్రోస్పెక్టివ్ అని పిలుస్తారు.

పెగసస్​ రగడ..

పెగసస్​ అంశంపై చర్చించాలంటూ చేస్తున్న డిమాండ్​ను కాంగ్రెస్ మరోసారి లేవనెత్తింది. కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆరోపించింది. ప్రజా సమస్యలపై విపక్షాలు పోరాటం కొనసాగిస్తాయని కాంగ్రెస్​ పేర్కొంది.

"పెగసస్​ అంశంపై చర్చల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం దారిమళ్లించే ప్రయత్నాలు చేస్తోంది. భారత్​ మినహా ఫ్రాన్స్​, హంగరీ, బల్గేరియా సహా ప్రపంచ దేశాలు పెగసస్​పై దర్యాప్తు చేయిస్తున్నాయి. చర్చలకు ఎందుకు భయపడుతున్నారు?"

-మల్లికార్జున్​ ఖర్గే, ప్రతిపక్ష నేత

పెగసస్​ వివాదంపై స్పందించిన భాజపా.. పలువురి ఫోన్​ నెంబర్లు ట్యాప్​ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

'అర్థవంతమైన చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉంది. అది పెగసస్​ వివాదం.. లేదా రైతు సమస్యలు అయినా సరే. కాంగ్రెస్.. కేవలం ఓ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని​ ప్రైవేటు సంస్థలా వ్యవహరిస్తోంది' అని భాజపా నేత రవిశంకర్​ అన్నారు.

ఇదీ చదవండి :'ప్రజల గొంతు నొక్కే ఆయుధమే 'పెగసస్​''

Last Updated : Aug 5, 2021, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details