పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీ దళ్ దిగ్గజం ప్రకాశ్ సింగ్ బాదల్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. ఆయన స్వగ్రామమైన ముక్త్సర్లోని బాదల్ గ్రామంలో ప్రకాశ్ సింగ్ అంత్యక్రియలు చేశారు. బాదల్ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఆయన కుమారుడు, శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్.. చితికి నిప్పు అంటించారు. మాజీ సీఎం భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, శిరోమణి అకాలీదళ్ మద్దతుదారులతో పాటు సాధారణ ప్రజలు సైతం పెద్ద ఎత్తున బాదల్ గ్రామానికి చేరుకున్నారు.
అంతకుముందు, ప్రజల సందర్శనార్థం బాదల్ భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాజీ సీఎంను కడసారి చూసుకునేందుకు వీలు కల్పించారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజల మధ్య యాత్ర సాగింది. బాదల్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు, ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
95 ఏళ్ల వయసున్న బాదల్ మంగళవారం తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన.. మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం.. బాదల్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
పంజాబ్ రాజకీయాల్లో ప్రకాశ్ సింగ్ బాదల్ క్రియాశీల పాత్ర పోషించారు. ఏకంగా 11సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా సేవలందించారు. ఒకసారి లోక్‌సభ ఎంపీగానూ పనిచేశారు. 1997 నుంచి లాంబీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1957లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బాదల్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1969 ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969 నుంచి 1970 మధ్య కాలంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్, పంచాయితీ రాజ్, పశు సంవర్ధక, డెయిరీ మంత్రిత్వ శాఖలలో కార్యనిర్వాహక మంత్రిగా బాదల్ పనిచేశారు.
ఎన్నికల చరిత్రలో బాదల్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. 1947 ఏడాదిలో పంజాబ్‌లోని బాదల్ గ్రామం నుంచి ఈయన సర్పంచ్‌గా గెలుపొందారు. అప్పట్లో.. అతి పిన్న వయసులో పదవిని చేపట్టిన సర్పంచ్‌గా.. బాదల్ రికార్డుకెక్కారు. 1970లో పంజాబ్ ముఖ్యమంత్రిగా బాదల్ గెలిచారు. అప్పుడు బాదల్ వయసు 43ఏళ్లు. దీంతో అత్యంత చిన్న వయసులో పంజాబ్ సీఎం పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డు సాధించారు. 2012లో మరోసారి పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. రాష్ట్రంలో అత్యంత వృద్ధ ముఖ్యమంత్రిగా (84 ఏళ్ల వయసులో)గా మరో రికార్డు నెలకొల్పారు.