Pariskha Pe Charcha: దిల్లీలోని తాలక్టోరా స్టేడియంలో నిర్వహించిన ఐదో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా కారణంగా సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ-2022 కార్యక్రమంలో విద్యార్థులను కలుసుకోవటం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు మోదీ. పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులు రూపొందించిన కళాకండాల ప్రదర్శనను తిలకించారు.
"సమయాభావం వల్ల విద్యార్థుల ప్రశ్నలన్నింటికి ఈ వేదికపై సమాధానం ఇవ్వలేం. వీడియో, ఆడియో, సందేశాలు, టెక్ట్స్ రూపంలో నమో యాప్ ద్వారా అందిస్తాను. ఇక్కడ కూర్చున్న వారిలో తొలిసారి పరీక్షలకు హాజరవుతున్నవారెవరూ లేరు. పలుమార్లు పరీక్షలకు హాజరైనందున వాటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మన జీవితంలో పరీక్షలు ఒక మెట్టు. పరీక్షల సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండాలి. స్నేహితులను అనుకరించకూడదు. నీకు వచ్చింది ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి. మీరంతా పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలి. ఆఫ్లైన్లో ఎలా జరిగిందో.. ఆన్లైన్లోనూ అదే జరుగుతుంది. ఇక్కడ మీడియం ముఖ్యం కాదు. మాధ్యమంతో సంబంధం లేకుండా, విషయాన్ని లోతుగా పరిశోధిస్తే, అర్థం చేసుకోవటంలో తేడా ఉండదు."