Parents Supari to kill Alcoholic Son in Bhadradri :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిళ్ల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు చేధించారు. మద్యానికి బానిసై.. తన ఖర్చుల కోసం ఉన్న ఇంటిని అమ్మేయాలంటూ హింసిస్తుండటంతో తల్లిదండ్రులే సుపారీ ఇచ్చి కుమారుడిని చంపించినట్లు గుర్తించారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమారుడు మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతలను గాలికొదిలేశాడు. అక్కడితో ఆగకుండా.. తన ఖర్చులు, జల్సాలకు ఉన్న ఇంటిని అమ్మేయాలంటూ తల్లిదండ్రులను మానసికంగా హింసించడం ప్రారంభించాడు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండె మండిపోయింది. కుమారుడు ఇక మన దారికి రాడనుకున్న ఆ దంపతులు.. మనసు చంపుకుని అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ ఇద్దరికి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో ఈ నెల 9న ఈ హత్య జరిగింది. 10న వెలుగులోకి రాగా.. పోలీసులు విచారణ చేపట్టారు.
Parents Killed Their Son by Giving Supari in Badradri :మృతుడు తెలంగాణలోని భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిల్ల రాము-సావిత్రి దంపతుల కుమారుడు దుర్గా ప్రసాద్(35)గా గుర్తించారు. రోజూ మద్యం తాగి ఇంటి కొచ్చి కుటుంబసభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడని.. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అయినా అతడు తన తీరు మార్చుకోకుండా ఉన్న ఇంటిని అమ్మేయాలని తల్లిదండ్రులను హింసించేవాడని పేర్కొన్నారు. కుమారుడు పెడుతున్న బాధలను చాలాకాలంగా భరిస్తూ వస్తున్న వారిలో చివరకు సహనం నశించి.. అతడిని అంత మొందించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇందుకోసం భద్రాచలానికే చెందిన గుమ్మడి రాజు, షేక్ అలీ పాషా అనే వ్యక్తులకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు.