ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థిని అద్భుత ప్రదర్శన చేసింది. నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకుంది. తమ కూతురు పాస్ అయ్యిందని సంతోషపడ్డారు తల్లిదండ్రులు. కానీ, తమ కూతురి విజయం ఎంత విలువైనదో తెలుసుకోలేకపోయారని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్ మహోబా జిల్లా బుందేల్ఖండ్ ప్రాంతంలోని బదెరా గ్రామానికి చెందిన రతీ బాయ్, లక్ష్మి ప్రసాద్ దంపతుల మూడో కూతురు అనసూయ(18). సీబీఎస్సీ 12వ తరగతిలో 600లకు గానూ 599 (99.8%) మార్కులు తెచ్చుకుంది. ఉత్తమ ప్రదర్శనకు ఇచ్చే 5 మార్కులతో వంద శాతం సాధించింది. పొలిటికల్ సైన్స్‌లో 99 మార్కులు రాగా.. ఇంగ్లీష్, హిస్టరీ, జియోగ్రఫీ, పెయింటింగ్, హిందీ సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు సాధించింది. తన కుంటుంబం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ఏకైక వ్యక్తి అనసూయే.
"మా తల్లిదండ్రులకు సంతోషమే కానీ, నా ఈ విజయం ఎంత విలువైనదో వారికి తెలియదు. నగరాల్లోని తల్లిదండ్రులకు ఆ విలువ తెలుసు. మా గ్రామంతో పాటు సమీప ప్రాంతాలకు చెందిన కొందరు నా ఫలితాల గురించి తెలుసుకున్నారు. వారందరూ సంతోషపడ్డారు కానీ నా ఫలితం విలువను ఇంకా అర్థం చేసుకోలేకపోయారు. మా నాన్న వ్యవసాయం చూసుకుంటూ కూలీకి వెళ్తారు. అమ్మ గృహిణి. నాకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు. అన్నయ్యలు 8వ తరగతి వరకు చదువుకొని ఆపేశారు. కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నారు. అక్కలు అసలు స్కూల్‌కే వెళ్లలేదు. కేవలం తమ్ముడే ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలు రాయనున్నాడు."
- అనసూయ, విద్యార్థిని
అనసూయ 10వ తరగతిలోనూ 98.2 శాతం మార్కులు తెచ్చుకుంది. అయితే.. 12వ తరగతి ఫలితాల విడుదలకు ముందు భయపడ్డానని, ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పింది. 599 మార్కులు సాధిస్తానని ఊహించలేదని తెలిపింది. చదువుతో పాటు పాఠశాల బాస్కెట్ బాల్, మ్యూజిక్ బ్యాండ్‌లో సభ్యురాలిగా ఉన్నానని, చిత్రలేఖనం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది అనసూయ.