బిహార్ జముయీలో హృదయవిదారక ఘటన జరిగింది. అప్పు చెల్లించలేదని పదేళ్ల బాలుడిని తీసుకెళ్లిపోయాడు ఓ వ్యక్తి. బందీగా ఉన్న తమ కొడుకును విడిపించేందుకు బాధితుడి తల్లిదండ్రులు.. 20 రోజుల నవజాతశిశువును రూ.30 వేలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా జనం గుమిగూడడం వల్ల.. అసలు విషయం బయటపడింది. బిడ్డను కొనేందుకు వచ్చిన మహిళ అక్కడి నుంచి పరారయ్యింది.
నవజాతశిశువు తండ్రి పేరు మెంగు మాంఝీ. అతడు హరియాణాలోని ఓ ఇటుక బట్టీలో పనిచేసేవాడు. ఇటుక బట్టీ కాంట్రాక్టర్ నుంచి అతడు రూ.5 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఏడు నెలలు గడిచినా అప్పు తీర్చలేకపోయాడు. అనంతరం కాంట్రాక్టర్ హరియాణా నుంచి వచ్చి రూ.5వేల బదులు రూ.25 వేలు ఇవ్వాలని మాంఝీని డిమాండ్ చేశాడు. మాంఝీ కుమారుడిని కాంట్రాక్టర్ తీసుకెళ్లిపోయాడు. డబ్బులిచ్చేవరకు మాంఝీ కుమారుడిని వదలని బెదిరించాడు. ఏం చేయాలో అర్థంకాక 20 రోజుల నవజాతశిశువును అమ్మేందుకు సిద్ధపడ్డానని మాంఝీ తెలిపాడు.
డబ్బుల కోసం కిడ్నాప్..
మధ్యప్రదేశ్ భోపాల్‌లో దారుణం జరిగింది. డబ్బుల కోసం స్నేహితులే ఓ యువకుడిని కిడ్నాప్ చేశారు. బాధితుడి తల్లికి ఫోన్ చేసి రూ.కోటి ఇమ్మని డిమాండ్ చేశారు. ఆమె అంతమొత్తంలో డబ్బులు ఇవ్వలేనని చెప్పడం వల్ల యువకుడిపై దాడి చేసి అడవిలో వదిలేసి పరారయ్యారు ముగ్గురు నిందితులు. అప్పటికే రాహుల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాహుల్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితుడు కటారా హిల్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. అతడు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడని వెల్లడించారు.