data protection bill: దేశంలో వ్యక్తిగత వివరాలకు భద్రత కల్పించే క్రతువు మరో అడుగు ముందుకేసింది. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న డేటా పరిరక్షణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేసీపీ) తన నివేదికకు తుదిరూపు ఇచ్చింది. 'పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2019' పై భాజపా పార్లమెంటు సభ్యుడు పీపీ చౌధరి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ... గురువారం తన నివేదికను ఉభయ సభలకు సమర్పించింది. వ్యక్తిగత డేటాతో పాటు వ్యక్తిగతేతర డేటానూ ఈ ముసాయిదా చట్ట పరిధిలోకి తీసుకురావాలని, తదనుగుణంగా దీన్ని విస్తృత పరచాలని సూచించింది. సామాజిక మాధ్యమాలను ప్రచురణకర్తలుగా పరిగణించి, వాటిని మరింత జవాబుదారీ చేయాలని పేర్కొంది. 'డేటా ప్రొటెక్షన్ అథారిటీ'ని ఏర్పాటు చేయడంతో పాటు... అన్ని స్థానిక, విదేశీ సంస్థలు నిబంధనలను సక్రమంగా పాటించేలా పర్యవేక్షించాలని సూచించింది.
కీలక ప్రతిపాదనలివీ..
- వ్యక్తుల డేటాను భారత్‌లోనే భద్రపరిచి.. సున్నితమైన, క్లిష్టమైన వ్యక్తిగత డేటాగా వర్గీకరించాలి. తద్వారా దాన్ని యాక్సెస్ చేయడాన్ని నియంత్రించాలి.
- వ్యక్తిగతేతర డేటానూ ముసాయిదా చట్ట పరిధిలోకి తీసుకురావాలి. లేనిపక్షంలో ఇది గోప్యతకు తీవ్ర హానికరంగా మారవచ్చు. సామాజిక మాధ్యమ వేదికల నియంత్రణకు కఠిన నియమావళి అవసరం.
- అన్ని డిజిటల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలకు సర్టిఫికేషన్‌ను జారీ చేసేందుకు ప్రత్యేక యంత్రాంగం అవసరం.
- తమ వేదిక ద్వారా వ్యక్తులు సమాచారాన్ని సృష్టించి, పంచుకుని, మార్పులు చేసేందుకు వీలు కల్పించే సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలను తక్షణం నియంత్రించాలి.
- మధ్యవర్తిత్వ సంస్థలుకాని అన్ని సామాజిక మాధ్యమాలనూ పబ్లిషర్లుగా పరిగణించాలి. తమ వేదికల ద్వారా అందించే కంటెంట్‌కు ఆయా సంస్థలను మరింత జవాబుదారీ చేయాలి. ధ్రువీకృతంకాని ఖాతాల నుంచి తమ వేదికల ద్వారా ప్రచురించే కంటెంట్‌కు ఆయా మాధ్యమాలే బాధ్యత వహించాలి.
- ప్రింట్/ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను ప్రచురించే సామాజిక వేదికల నియంత్రణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలో చట్టబద్ధమైన మీడియా రెగ్యులేటరీ అథారిటీని నెలకొల్పాలి.
- ప్రస్తుతమున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు... ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి అత్యాధునిక విధానాలను అందిపుచ్చుకుంటున్న పాత్రికేయ రంగాన్ని నియంత్రించేందుకు తగిన విధంగా సన్నద్ధం కాలేదు. కాబట్టి, వివిధ రకాల మీడియా నియంత్రణకు ఒక చట్టబద్ధమైన సంస్థ అవసరం.
జాతీయ భద్రత కంటేవ్యక్తిగత గోప్యత ముఖ్యం కాదు...