తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో గురువారం చెన్నైలోని శ్రీవారు వెంకట చలపతి ప్యాలెస్‌లో కీలక సమవేశం జరిగింది. పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు. అయితే గురువారం జరిగిన సమావేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకరి నాయకత్వంలో పార్టీ నడవాలనే నిర్ణయించినందున.. పళనిస్వామి(ఈపీఎస్) క్యాంప్‌కు ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపారు. దీంతో సమావేశం మధ్యలోనే పార్టీ సమన్వయకర్త పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్ చేశారు. పార్టీ డిప్యూటీ సెక్రటరీ ఆర్. వైతిలింగంతో సహా ఓపీఎస్ మద్దతుదారులంతా మీటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు తీవ్రస్థాయిలో ఓపీఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపు మంచి నీళ్ల సీసాలను విసిరారు. పన్నీర్‌సెల్వం కారు టైర్ల గాలి కూడా తీసేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సమావేశం కేవలం 40 నిమిషాల్లోనే ముగిసింది. జూలై 11న మళ్లీ అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది.