పట్టిందల్లా బంగారం అన్నట్లు మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గని.. డైమండ్ అన్వేషకుల పాలిట కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే చెరువు గట్టుపై వాకింగ్‌కు వెళ్తున్న ఓ వ్యక్తికి డైమండ్ దొరకగా.. అంతకముందు నవమి రోజున మరో వ్యాపారి ఇదే వజ్రాల వల్ల లక్షాధికారి అయ్యాడు. అలా పన్నా గనుల్లో డైమండ్స్ విరివిగా దొరుకుతుందనే ఆశతో ఓ కార్మికుడు గనుల్లోని ఓ ల్యాండ్‌ను లీజ్‌కు తీసుకున్నాడు.
ఎంతో కాలం శ్రమించినా అతడికి చిన్నపాటి డైమండ్స్ తప్ప మరేం దొరకలేదు. అలా కష్టపడుతున్న సమయంలో నష్టాలు అతడిని ఆర్థికంగా కుంగదీశాయి. దీంతో అతడికున్న భూమిని సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అతడు నిరాశ చెందలేదు. అలా శ్రమిస్తూ వచ్చిన అతడికి సోమవారం ఓ వజ్రం దొరికడం వల్ల రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.
అసలేం జరిగింది: ఛతర్‌పుర్ జిల్లాకు చెందిన హుక్మాన్ అహిర్వార్ అనే కార్మికుడు వజ్రాల మీద మక్కువతో, పన్నాలోని వజ్రాల గనిలో కొంత భూమిని లీజ్‌కు తీసుకున్నాడు. ఎంతో కాలం శ్రమించగా ఆయనకు 8 చిన్న వజ్రాలు లభించాయి. ఎప్పటికన్నా పెద్ద వజ్రం దొరుకుతుందన్న ఆశతో ఇంకా తవ్వడం ప్రారంభించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.
దొరికిన వజ్రాన్ని చూపిస్తున్న హుక్మాన్ అహిర్వార్ గనుల వల్ల వచ్చిన నష్టాన్ని తీర్చడానికి తనకున్న రెండున్నర ఎకరాల భూమిని అమ్మాడు. అయినా సరే వెనక్కి తగ్గకుండా తవ్వుతూనే ఉన్నాడు. ఫలితంగా అతడికి సోమవారం 4.5 క్యారెట్ల వజ్రం లభించింది. ఇంతకాలానికైనా అనుకున్నది సాధించానని హుక్మన్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఆ వజ్రాన్ని డైమండ్ ఆఫీస్‌లో జమ చేశాడు. 4.5 క్యారెట్ల ఈ వజ్రం సుమారు రూ.10 నుంచి 12 లక్షల మేర ధర పలుకుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నాణ్యమైన వజ్రాన్ని రానున్న వేలంలో ఉంచనున్నట్లు డైమండ్ కార్యాలయంలోని అధికారులు తెలిపారు.