ఇద్దరు సామాన్యులు.. రాత్రికి రాత్రే లక్షాధికారులయ్యారు. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో వజ్రాల నిక్షేపాలు అపారంగా ఉండడమే ఇందుకు కారణం. ఇటీవలే అదే ప్రాంతంలో రూ.40 లక్షలు విలువైన వజ్రం దొరికి నొయిడాకు చెందిన రాణా ప్రతాప్ జీవితంరాత్రికి రాత్రే మారిపోగా.. ఆ కోవలోకి మరో ఇద్దరు చేరారు.
వివరాల్లోకి వెళ్తే.. పన్నాలో జరిగే శరద్‌పూర్ణిమ మేళాకు వృందావన్ రైక్వార్ అనే వ్యక్తి వచ్చాడు. మేళా అంతా తిరిగాక అతను కమలాబాయి చెరువు వద్ద తిరుగుతుండగా ఆ ప్రాంతంలో అతనికి ఓ అరుదైన వజ్రం దొరికింది. 4.86 క్యారెట్ జెమ్స్ క్వాలిటీ గల ఈ వజ్రం విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. దీన్ని అతను పన్నాలోని డైమండ్ ఆఫీస్‌లో డిపాజిట్ చేశాడు.
పన్నా వజ్రాన్ని సొంతం చేసుకున్న మరో అదృష్టవంతుడు దస్సూ కోందర్కు చెందిన గాడా ఛతర్‌పుర్. ఇతను గత కొంత కాలంగా వజ్రాల వేటలో నిమగ్నమయ్యుండగా బుధవారం అతని పంట పండింది. ఓ అరుదైన వజ్రం అతని సొంతమయ్యింది. 3.40 క్యారెట్లు గల ఈ వజ్రాన్ని అతను పన్నాలోని డైమండ్ ఆఫీస్‌లో డిపాజిట్ చేశాడు. ఈ రెండు వజ్రాలను త్వరలో జరిగే వేలంలో ఉంచనున్నట్లు డైమండ్ ఆఫీస్ అధికారులు తెలిపారు.