ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ మరోసారి రహస్య పత్రాలు (Pandora Papers) బహిర్గతమయ్యాయి. ఐదేళ్ల కిందట 'పనామా పేపర్ల' (Panama Papers) పేరుతో పేలిన బాంబు కన్నా శక్తిమంతంగా 'పాండోరా పేపర్ల' (Pandora Papers ICIJ) పేరుతో ఆదివారం రాత్రి ఎంతోమంది ప్రముఖుల బాగోతాలను వెలుగులోకి తెచ్చాయి. తక్కువ పన్ను ఉన్న దేశాలకు పెద్దఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలు వీటిలో ఉన్నాయి. (Pandora Papers 2021)
జాబితాలో 91 దేశాలకు చెందిన వందలమంది ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, బిలియనీర్లు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలు, దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నవారూ కలిపి దాదాపు 380 మంది భారతీయులు! (Pandora Papers India) 'అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి' (ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్- ఐసీఐజే) (ICIJ News) ఈ వివరాలను విడుదల చేసింది. 117 దేశాల్లోని 150కిపైగా వార్తాసంస్థల్లోని 600 మంది విలేకరులు (ICIJ Pandora Papers) ఈ క్రతువులో భాగస్వాములయ్యారు.
ఇది అతిపెద్ద పరిశోధనాత్మక విశ్లేషణగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కూటమి వేర్వేరు దేశాల్లోని దాదాపు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను (Pandora Papers) పరిశీలించి, గుట్టుమట్లు రట్టు చేసింది. విశ్లేషించిన మొత్తం సమాచారం పరిమాణం 2.94 టెరాబైట్ల మేర ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. (Pandora Papers ICIJ)
గోప్యంగా లావాదేవీలు
భారత్, అమెరికా, రష్యా సహా 45 దేశాలకు చెందిన 130 మంది బిలియనీర్లు ఈ జాబితాలో ఉన్నారు. 336 మంది ఉన్నతస్థాయి రాజకీయవేత్తలు, అధికారులకు విదేశాల్లో 956 కంపెనీల పేరిట పెట్టుబడులు ఉన్నట్లు తేలింది. మారుపేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల సాయంతో వీరంతా ఆస్తులను రహస్యంగా కొనుగోలు చేశారు. పనామా, దుబాయ్, మొనాకో, స్విట్జర్లాండ్, కేమన్ ఐలాండ్స్ వంటి చోట్ల గోప్యంగా ఆర్థిక లావాదేవీలను సాగించారు.
- బ్రిటన్‌లోని ఒక కోర్టులో దివాలా ప్రకటించిన భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 'అసెట్ హోల్డింగ్ ఆఫ్‌షోర్ కంపెనీ'లు ఉన్నాయి.
- పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ భారత్ వీడటానికి నెల ముందు ఆయన సోదరి ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.
- బయోకాన్ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అభియోగాలపై సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి ట్రస్టును నెలకొల్పారు.
2016లో పనామా పత్రాలు బహిర్గతమయ్యాక ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు జాగ్రత్త పడినట్లు తాజా పత్రాలు (Pandora Papers ICIJ) చెబుతున్నాయి. అనేక మంది భారతీయులు, (Panama Papers Indian names) ఎన్నారైలూ విదేశాల్లోని తమ సంపదను పునర్‌వ్యవస్థీకరించారు. 2021 ప్రారంభం నాటికి రూ.20వేల కోట్లకుపైగా అప్రకటిత విదేశీ, స్వదేశీ సంపదను పన్ను అధికారులు గుర్తించారు.