Intercaste Marriage News In Maharashtra: కులాంతర వివాహం చేసుకునందుకుగాను ప్రభుత్వ పథకాలను నిలిపివేశారు ఓ గ్రామస్థులు. ఈ ఘటన మహారాష్ట్ర నాశిక్‌లోని రాయంబే గ్రామంలో జరిగింది. ప్రభుత్వ పథకాలను పొందబోమని రాతపూర్వక హామీ ఇవ్వాలంటూ బలవంతం చేశారు గ్రామస్థులు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ పలు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇదీ జరిగింది:నాశిక్ తాలుకాలోని వాల్విహిర్ గ్రామానికి చెందిన ఎస్టీ యువతి.. అదే తాలుకాలోని రాయంబే గ్రామంలో నివసించే మరో కులానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. వివాహనంతరం మే 5న యువకుడి ఇంటికి వచ్చింది యువతి. దీంతో మహిళ వర్గానికి చెందిన కుల పెద్దలు ఆగ్రహానికి గురయ్యారు. భార్యభర్తలను పంచాయతీకి పిలిపించారు. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందున ఎస్టీలకు అందే ప్రభుత్వ పథకాలను తీసుకోబోమని రాతపూర్వక హామీ ఇవ్వాలని యువతిని బలవంతం చేశారు. దీంతో దంపతులు సంతకాలు చేశారు. దీనిపై ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని 'వంచిత్ బహుజన్ అఘాడీ' నాయకులు తీవ్రంగా స్పందించారు. రాయంబే గ్రామ సర్పంచ్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని.. సర్పంచ్, కులపెద్దలపై కేసు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కులాల మధ్య విభేదాలను తొలగించడాన్ని ప్రోత్సహిస్తుందని.. కులాంతర వివాహాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తుందని పేర్కొన్నారు.
Widow Rituals Ban: మరోవైపు, మహారాష్ట్ర కొల్హాపుర్‌లోని ఓ గ్రామంలో ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. మహిళను వితంతువుగా మార్చే పద్ధతులను నిషేధించాలని షిరోల్ తహసీల్‌లోని హెర్వాడ్ గ్రామపంచాయితీ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. సంఘ సంస్కర్త రాజర్షి ఛత్రపతి షాహు మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు గ్రామస్థులు.
"కొవిడ్ 19 మొదటి వేవ్‌లో మా సహచరులలో ఒకరు గుండెపోటుతో మరణించారు. అంత్యక్రియల సమయంలో అతని భార్యను వింతతువును చేసే సంప్రదాయాన్ని నేను చూశాను. ఇది స్త్రీ దుఃఖాన్ని మరింత పెంచింది. ఆ దృశ్యం నా హృదయాన్ని కదిలించింది. నా మరణానంతరం.. నా భార్య ఈ పద్ధతికి గురికాకూడదని స్టాంప్ పేపర్‌పై రాసిచ్చాను. చాలా మంది పురుషులు నాకు మద్దతు ఇచ్చారు. హెర్వాడ్ గ్రామ పంచాయతీలో తీర్మానాన్ని ఆమోదించాలని ప్రతిపాదించాను."
- ప్రమోద్ జింజాడే, గ్రామస్థుడు