ఎడప్పడి కె. పళనిస్వామి.. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి. సీఎంగా ఇటీవలే నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు ఆయన. వాస్తవానికి పళనిస్వామి ఇన్నేళ్లు అధికారంలో ఉండటం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులో 'అమ్మ'గా కొలిచే జయలలిత మరణం అనంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఎక్కువ రోజులు ఉండలేరని చాలా మంది అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగారు. మరి నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న పళనిస్వామికి.. ప్రజలు ఈసారి ఓటువేస్తారా? అన్నాడీఎంకేను తిరిగి అధికార పీఠంపై కూర్చోపెడతారా?
అమ్మ మరణంతో..
నాటి ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016లో మరణించారు. అనంతరం ప్రస్తుత డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్‌సెల్వం.. రెండు నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ జయ సన్నిహితురాలు శశికళ అండతో 2017 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పళనిస్వామి. పన్నీర్‌సెల్వంతో జరిగిన 'ధర్మ యుద్ధం'లో విజయం పళనిస్వామినే వరించింది.
ఇదీ చూడండి:-తమిళనాట 'రాజకీయ శూన్యత' నిజమా? భ్రమా?
పదవి చేపట్టిన తొలినాళ్ల నుంచే పళనిస్వామికి ఎన్నో విమర్శలు, అనేక అంశాల్లో వ్యతిరేకత ఎదురైంది. అన్నాడీఎంకే ప్రభుత్వం నాలుగు నెలల్లోనే కుప్పకూలుతుందని డీఎంకే అధినేత స్టాలిన్ అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు. అటు ఏఎంఏంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కూడా అన్నాడీఎంకేపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీలోని 'స్లీపర్ సెల్స్' సహాయంతో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు.
ఇన్ని సమస్యల మధ్య పళనిస్వామి ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఇందులో ఎన్నో ఘనతలు, వివాదాలు, వైఫల్యాలు ఉన్నాయి.
రిజర్వేషన్.. ఉచిత టీకా..
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5శాతం రిజర్వేషన్ ప్రకటించింది అన్నాడీఎంకే ప్రభుత్వం. ఇది పళనిస్వామి పాలనలో సాహసోపేత నిర్ణయం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కావేరీ వివాదాన్ని పరిష్కరించింది. రైతు రుణాలను భారీగా మాఫీ చేసింది. వంతెనలు నిర్మించింది. నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టింది. కరోనా లాక్డౌన్ వేళ ప్రజల రక్షణను చూసుకుంది పళనిస్వామి ప్రభుత్వం. తమ ప్రజలకు ఉచిత కరోనా టీకా ప్రకటించిన తొలి రాష్ట్రంగా నిలిచింది.
తూత్తుకుడి ఘటన...
నాలుగేళ్ల అన్నాడీఎంకే పాలనలో ఘనతల కన్నా వివాదాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. భాజపాతో ఉన్న పొత్తు ఇందుకు ముఖ్య కారణం. కమలదళంతో స్నేహం కోసం.. రాష్ట్ర ప్రజల హక్కులను అన్నాడీఎంకే త్యాగం చేసిందని డీఎంకే ఆరోపించింది.
అదే సమయంలో.. జయలలిత వ్యతిరేకించిన పథకాలను పళనిస్వామి-పన్నీర్‌సెల్వం ప్రవేశపెట్టడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఇదీ చూడండి:-'సీఏఏ నిరసనలు, లాక్డౌన్ ఉల్లంఘనల కేసులు ఎత్తివేత'
2018 మే 22న తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమలో జరిగిన హింస.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపగా.. 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దీనిపై పళనిస్వామి స్పందించిన తీరు కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. 'ఈ ఘటన గురించి నేను కూడా టీవీలో చూసే తెలుసుకున్నాను. విద్రోహ శక్తులపై చర్యలు చేపట్టడం పోలీసులకు సహజమైన విషయం,' అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రజలు, సామాజిక కార్యకర్తలు, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.