యాభై ఏళ్ల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో లొంగేవాలా ప్రాంతంలో మనల్ని ఓడించేందుకు దాయాది దేశం తెలివిగా ప్లాన్ చేసిందని భారత వైమానిక దళ అధిపతి చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా వెల్లడించారు. అయితే మన వాయుసేన శక్తిని పాక్ అంచనా వేయలేకపోయిందని తెలిపారు. రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భరత్ కుమార్ రచించిన 'ది ఎపిక్ బ్యాటిల్ ఆఫ్ లొంగేవాలా' పుస్తకాన్ని భదౌరియా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''లొంగేవాలా యుద్ధం గురించి చాలా చెప్పాలి. యుద్ధం కోసం ఎంచుకున్న ప్రాంతం, మార్గం విషయంలో పాకిస్థాన్ సైన్యం తెలివిగా ప్లాన్ రచించింది. ఆ పథకం ఫలించి ఉంటే పశ్చిమఫ్రంట్‌లో యుద్ధ ఫలితం మారిపోయి ఉండేది. కానీ అక్కడే పాకిస్థాన్ ఓ విషయాన్ని మర్చిపోయినట్లు ఉంది. భారత వాయుసేన శక్తిని అంచనా వేయలేకపోయింది. జైసల్మేర్‌లో హంటర్ యుద్ధవిమానాలతో ఉన్న సగం స్క్వాడ్రాన్ మమ్మల్ని ఏం చేయగలదులే అని అతివిశ్వాసంతో ఉంది. బహుశా వారు చేసిన పొరబాటు అదేనేమో'' అని భదౌరియా చెప్పుకొచ్చారు.