తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ చిన్నారికి కేరళ వైద్యుల పునర్జన్మ.. ప్రపంచంలోనే అరుదైన ఆపరేషన్ చేసి.. - Pakistani boy Bone marrow operation in Kerala news

పాకిస్థాన్​కు చెందిన రెండేళ్ల బాలునికి కేరళ వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ప్రపంచంలోనే అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న బాలునికి ఆపరేషన్ చేసి పునర్జన్మను ప్రసాదించారు. అసలేం జరిగిందంటే..

Pakistani boy Bone marrow operation in Kerala
కేరళలో ఆస్టర్ మిమ్స్ ఆసుపత్రి

By

Published : Dec 4, 2022, 12:50 PM IST

పాకిస్థాన్​కు చెందిన ఓ బాలునికి కేరళ వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న అతడికి.. చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. ఆ బాలుడు పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌కు చెందిన జలాల్, సాధూరి దంపతుల కుమారుడు. ఆ చిన్నారి పేరు సైఫ్ జలాల్. రెండేళ్ల వయసున్న సైఫ్ జలాల్, తీవ్రమైన కంబైన్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సలో భాగంగా చిన్నారి బోన్​మేరోను పూర్తిగా మార్చేయాల్సి ఉంటుంది. దీనికి వైద్యం చేయించేదుకు బాలుడి తల్లిదండ్రులు పాకిస్థాన్​లోని ఎన్నో ఆసుపత్రులకు తీసుకుని వెళ్లారు. అయితే సైఫ్​ జలాల్​కు వచ్చింది ప్రపంచంలోనే అరుదైన వ్యాధి కావటం వల్ల డాక్టర్స్ చేతులెత్తేశారు.

అనంతరం, బాలుడిని అతని తల్లిదండ్రులు యూఏఈలోని ఓ హాస్పిటల్​కు తీసుకుని వెళ్లారు. ఆ ఆసుపత్రిలో సైఫ్ జలాల్​కు.. కీమోథెరపీ చికిత్స జరిగింది. కానీ అక్కడ బాలుడి పరిస్థితి మరింత దిగజారింది. చాలా రకాల ఇన్ఫెక్షన్స్ సోకాయి. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్​ కారణంగా రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. దీంతో సైఫ్ జలాల్​ను వెంటిలేటర్​పై ఉంచారు. అన్ని ఆశలు సన్నగిల్లిన స్థితిలో బాలుని తల్లిదండ్రులు, కేరళలోని ఏస్తర్ మలబార్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్స్(మిమ్స్)లో అందుబాటులో ఉన్న చికిత్స అవకాశాల గురించి తెలుసుకున్నారు. దీంతో ఆ దంపతులలో మళ్లీ కొత్త ఆశలు పుట్టుకొచ్చి బిడ్డను రక్షించుకునేందుకు కోజికోడ్‌లో మిమ్స్​కు తమ బిడ్డను తీసుకురావాలని భావించారు.

కేరళలో ఆస్టర్ మిమ్స్ ఆసుపత్రి

దీంతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. భారత విదేశాంగ శాఖ అధికారుల సహకారంతో ఫార్మాలిటీస్ అన్నీ చకచకా పూర్తి చేసుకొని.. బాలుడిని కోజికోడ్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సీరియస్ కండీషన్​లో సైఫ్ జలాల్ హాస్పిటల్​లో చేరాడు. ఏస్తర్ మిమ్స్ ఆసుపత్రిలో ఉన్న సీనియర్ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ కేశవన్, ఆయన వైద్య బృందం బాలుని ఆరోగ్య పరిస్థతిని చూసి వెంటనే వైద్యం చేయడం ప్రారంభించారు. బాలుని తల్లి బోన్​మేరోలో సైఫ్ జలాల్​ వైద్యానికి సరిపడా పోలికలను వైద్యులు గుర్తించారు. తర్వాత బాలునికి బోన్​మేరో ట్రాన్స్​ప్లాంటేషన్ చేశారు. ఈ ఆపరేషన్ చేసిన రెండు నెలలకు బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. జీవితంలో సంక్లిష్ట పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొన్నాడు.

బాలుని తల్లిదండ్రులు

"అదృష్టవశాత్తు బాలునికి తన తల్లి బోన్​మేరో మ్యాచ్ అయింది. ఇప్పుడు బాలునికి ఎలాంటి ప్రమాదం లేదు. ఇప్పుడు సైఫ్ జలాల్ వెంటిలేటర్​పై ఉండే అవసరం లేదు. బాలుడు తన దేశానికి సంతోషంగా తిరిగివెళ్లొచ్చు."
-డాక్టర్​ కేశవన్

దేవుడిపైనే భారం వేసి ఈ ఆపరేషన్ విషయంలో ముందుకెళ్లినట్లు బాలుని తండ్రి తెలిపారు. "మేము ఇక్కడి వచ్చేసరికే మా బిడ్డ పరిస్థితి చాలా విషమంగా ఉంది. డాక్టర్లు వెంటనే వైద్యం అందించేదుకు సిద్ధంగా ఉన్నారు. అయితే బతికేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. 'మీరు ముందుకెళ్లి వైద్యం చేయండి. తర్వాత దేవునిపైనే భారం' అని వారితో చెప్పాం. సర్జరీ జరిగిన రెండు నెలలకు నా బిడ్డ పూర్తిగా కోలుకున్నాడు. నా కొడుకును కాపాడుకునేందుకు సహాయం చేసిన అందరికీ ధన్యవాదాలు అని" ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details