పర్యావరణ కార్యకర్త దిశ రవికి మద్దతు తెలుపుతూ.. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు పాకిస్థాన్ మరోసారి యత్నించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ పాలనలోని భారత ప్రభుత్వం.. తమకు వ్యతిరేకంగా ఉన్న స్వరాలను అణచివేయాలని చూస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ.. ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ.. పీటీఐ చేసిన ట్వీట్ "మోదీ, ఆరెస్సెస్ పాలనలోని భారత ప్రభుత్వం.. తమకు వ్యతిరేకంగా ఉన్న గళాన్ని అణచివేయాలని చూస్తున్నారు. టూల్‌కిట్ కేసులో దిశ రవిని వాళ్లు ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని అదే విధంగా చేస్తున్నారు.
--పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్
పీటీఐ ట్వీట్‌తో పాటు.. పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా.. దిశ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వీడియో క్లిప్‌ను పోస్టు చేశాయి.
పర్యావరణ కార్యకర్తకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మద్దతు తెలపడంపై.. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తమ దేశంలోని మైనార్టీలకు రక్షణ కల్పించడంలో పాక్ అనసరిస్తున్న విధానాన్ని అందరూ తప్పుబడుతున్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో 3 నెలలుగా అన్నదాతలు ఉద్యమిస్తున్నారు. వారికి మద్దతుగా నిలిచారు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ట్విట్టర్లో ఓ టూల్ కిట్‌ను పోస్టు చేశారు.గ్రెటా షేర్ చేసిన టూల్ కిట్ రూపకల్పన, వ్యాప్తిలో దిశ కీలక కుట్రదారని పోలీసులు అంటున్నారు. అందుకోసం వాట్సాప్‌లో ఆమె ఓ గ్రూప్ నిర్వహించినట్లు చెప్పారు. అందులో భాగస్వాములైన మరికొందరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.