దేశంలో భారీ ఉగ్ర దాడికి పన్నిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఇద్దరు తీవ్రవాదులు సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పండుల సీజన్లో రద్దీ ప్రాంతాల్లో దాడుల కోసం పేలుడు పదార్థాలను, హత్యల కోసం ఆయుధాలను ఉగ్రవాదులు సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు.
"కోటాలో సమీర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాము. దిల్లీలో ఇద్దరిని, ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. ఈ ఆరుగురు భారతీయులే. వీరిలో ఇద్దరు పాకిస్థాన్‌కి వెళ్లి ఆయుధాల వాడకంలో 15రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. విచారణలో భాగంగా.. 15మంది బంగ్లా భాష మాట్లాడే వారు తమ బృందంలో ఉన్నట్టు వీరు వెల్లడించారు. వీరిని కూడా శిక్షణ కోసం తీసుకెళ్లినట్టు అనుమానిస్తున్నాము. సరిహద్దు బయట నుంచి ఆపరేషన్‌ను నడిపిస్తున్నట్టు అనిపిస్తోంది."