కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్ మరోసారి చర్చల ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ వివాదం చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని పేర్కొంది. చర్చల విషయంపై సంకోచించవద్దని భారత్‌ను కోరింది. ఈ విషయంపై పాకిస్థాన్ ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదని చెప్పుకొచ్చింది. అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా 'కశ్మీర్' అంశాన్ని అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సమస్యగా పేర్కొంది పాక్. ఐరాస భద్రతా మండలి తీర్మానాల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
"చర్చల నుంచి దూరం వెళ్లాలనుకునే వారు బలహీనంగా ఉన్నారని అర్థం. మా వైఖరిని బట్టి మేం బలమైన స్థితిలో ఉన్నామని స్పష్టమవుతోంది. కశ్మీర్ సమస్యపై పాక్ దృష్టికోణంలో మార్పు లేదు. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలని నిర్ణయించడం.. మా వైఖరికి అద్దం పడుతోంది. మనకు ఉన్న ఏకైక సమస్య కశ్మీర్. చర్చల ద్వారానే దీన్ని పరిష్కరించుకోగలం. పాకిస్థాన్ చర్చల నుంచి దూరం జరగలేదు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కశ్మీర్ సమస్య సహా అన్ని వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాక్ ఎప్పుడూ చెబుతూ వస్తోంది."