Padma Shri Shakuntala Choudhary: ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాడి, తన జీవితమంతా ప్రజల సేవకు అంకితం చేసిన సమరయోధురాలికి 102 ఏళ్ల వయసులో పద్మ పురస్కారం వరించింది. అస్సాంకు చెందిన గాంధేయవాది శకుంతలా చౌదరిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు స్పందిస్తూ.. ఆమెకు ఈ అవార్డును ఎప్పుడో ఇవ్వాల్సిందని అన్నారు. కానీ, అసలే ఇవ్వకపోవడం కంటే ఆలస్యంగా అయినా ప్రకటించడం కొంతవరకు సంతోషమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వయసులో ఆవిడ పురస్కారాన్ని స్వీకరించేందుకు అంత దూరం రాలేరని చెప్పారు.
102 ఏళ్ల శకుంతలా చౌదరి గాంధేయవాది. గువాహటిలోని ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. చిన్నప్పుడు ఆమె టీచర్ కావాలనుకున్నారట. స్కూల్లో తనతో పాటు చదువుతున్న ఓ విద్యార్థి తండ్రి పేదలకు ఆశ్రమం కోసం భూమిని దానం చేయడంతో శకుంతల కూడా వారితో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి సమాజసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె.. 1955లో కస్తుర్బా గాంధీ నేషనల్ మోమోరియల్ ట్రస్ట్‌కు ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. 20 ఏళ్ల పాటు ఈ ట్రస్ట్‌కు నేతృత్వం వహించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికీ 1946లో జాతిపిత మహాత్మాగాంధీ చివరిసారిగా సందర్శించిన శరణియా ఆశ్రమంలోనే ఉంటున్నారు.
ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, భూదాన్ ఉద్యమనేత వినోబా భవేకు అత్యంత సన్నిహితురాలైన శకుంతల.. ఆయనతో కలిసి అస్సాంలో ఏడాదిన్నర పాటు పాదయాత్ర కూడా చేశారు. మహిళలు, బాలికల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేశారు. స్త్రీ శక్తి జాగరణ్‌తో కలిసి మహిళా సాధికారత కోసం పోరాడారు. ఆమె సేవలకు మెచ్చి ఈ ఏడాది ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.