Padma awards: పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా.. సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.
భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమార్తెలు క్రితిక, తరణి అవార్డును అందుకున్నారు. రాధే శ్యామ్ ఖేంకాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమారుడు రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డును స్వీకరించారు.
పద్మ భూషణ్..
సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పద్మ భూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకున్నారు. పారాలింపిక్ రజత పతక విజేత దేవేంద్ర ఝఝారియా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా, సచిదానంద స్వామి సహా పలువురికి పద్మ భూషణ్ అవార్డులను ప్రదానం చేశారు కోవింద్.