తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పద్మ భూషణ్‌ అందుకున్న మంగళం బిర్లా.. అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం - padma bhushan awards 2023

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో బుధవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ఏడాది ప్రకటించిన పద్మ పురస్కార గ్రహీతల్లో కొంత మంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

padma awards 2023
పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

By

Published : Mar 22, 2023, 8:22 PM IST

Updated : Mar 22, 2023, 10:54 PM IST

వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 50 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. 2023 ఏడాదికి గాను విభిన్న రంగాల్లో సేవలందించిన ఆరుగురికి పద్మ విభూషణ్‌, తొమ్మిది మందికి పద్మభూషణ్‌, 91 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా.. అందులో 50 మందికి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, అనురాగ్​ సింగ్​ ఠాకుర్​తో పాటు ఇతర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ప్రముఖ వాస్తు శిల్పి బాలకృష్ణకు మరణానంతరం పద్మ విభూషణ్‌ ప్రదానం చేశారు. ఆదిత్య బిర్లా సంస్థల అధినేత కుమార మంగళం బిర్లా, ప్రముఖ నేపథ్య గాయని సుమన్‌ కళ్యాణ్‌పుర్‌ పద్మ భూషణ్‌ అవార్డును స్వీకరించారు. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక వేత్త కమలేష్ డి పటేల్‌కు మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు మరణానంతరం పద్మ శ్రీ పురస్కారం ప్రకటించగా.. ఆ అవార్డును ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా అందుకున్నారు. బైగా పెయింటింగ్‌లో జోధయ్య బాయి బైగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కళాకారిణి ఉషా బార్లే, కేరళకు చెందిన గిరిజన రైతు రామన్ చెరువాయల్‌ పద్మశ్రీ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం నుంచి మోదడుగు విజయ్​ గుప్తా పద్మ శ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 2019 నుంచి ఎవరికీ ఇవ్వలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి కూడా పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. అయితే త్వరలోనే ఈయన కూడా అవార్డును అందుకోనున్నారు.

పలు రంగాల్లో అసాధారణమైన, విశేష సేవలందించే ప్రముఖులకు ఈ అత్యున్నత పురస్కారాలను ప్రతి సంవత్సరం అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడా, సామాజిక, విజ్ఞాన, ఇంజినీరింగ్‌, పబ్లిక్‌ అఫైర్స్‌, సివిల్‌ సర్వీసెస్​, వాణిజ్యం, పారిశ్రామిక, తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి ఏటా పురస్కారాలు ప్రకటిస్తుంటుంది ప్రభుత్వం. ఈ సంవత్సరం అవార్డు గ్రహీతల్లో మొత్తం తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. కాగా, ఏడుగురికి మరణానంతరం ఈ గౌరవం లభించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రకటిస్తారు. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి అవార్డ్​ గ్రహీతలకు ప్రదానం చేస్తారు.

Last Updated : Mar 22, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details