ఆహారం కోసం పంటపొలాల్లోకి వచ్చే ఏనుగులు, రైతులకు మధ్య ఘర్షణలు జరగడం కొత్తేం కాదు. అటవీప్రాంతం వేగంగా తగ్గుతున్న అసోంలో ఈ ఘటనలు మరీ ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు అసోంలోని నాగావ్ జిల్లాకు చెందిన వన్యప్రాణి ప్రేమికుడు వినోద్ దులు బోరా, ఆయన భార్య మేఘన మయూరి హజారికా కృషిచేస్తున్నారు. ఏనుగులకోసమే ప్రత్యేకంగా వరిపొలాలు, పండ్ల తోటలు పెంచుతున్నారు. ఆహారం కోసం జనావాసాల్లోకి వెళ్లకుండా వాటిని అడ్డుకోవడమే వారి ఉద్దేశం. ఇందుకోసం స్థానికుల సాయంతో హాథీబొంధు అనే సంస్థను స్థాపించారు ఈ దంపతులు.
గతేడాది హాథీ బొంధు సంస్థ 200 బిగాల్లో వరి పండించింది. రోంగాంగ్ గ్రామస్థులు ఏనుగుల కోసం భూమిని దానంగా ఇచ్చారు. ఫలితంగా మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. ప్రజల విన్నపం మేరకు మరో 600 బిగాలు ఏనుగుల కోసమే కేటాయించాం. 200 బిగాల్లో వరి పండించి, మిగతా భూముల్లో నేపియర్ గడ్డి, చీపురుగడ్డి, పనసతోటలు, ఎలిఫెంట్ ఆపిల్ తోటలు పెంచాం.
-వినోద్ దులు బోరా, ప్రకృతి ప్రేమికుడు.
'హాథీ బొంధు'కు అసోం అటవీ శాఖ కూడా సహకారమందిస్తోంది. ఆహారం కోసం వెదుక్కుంటూ ఏనుగుల గుంపులు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు కొద్దినెలలుగా బాగా తగ్గాయి.
2018లోనే హాథీ బొంధు ఉద్యమాన్ని ప్రారంభించాం. అప్పుడు మాకు స్పష్టమైన ఆలోచనైతే లేదు గానీ.. ఏనుగుల కోసం 15 నుంచి 20 వేల అరటి, పనస మొక్కలు నాటాం. 2019లో వరి పండించేందుకు రోంగాంగ్ గ్రామ ప్రజలు మా సంస్థకు కొంత భూమిని విరాళంగా ఇచ్చారు. కర్బీ అంగ్లాంగ్ పర్వత ప్రాంతంలోని ఓ ఆదివాసీ గ్రామం అది.