మహారాష్ట్ర నాసిక్‌లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంక్ లీకేజీ కారణంగా 22 మంది రోగులు చనిపోయారు. వారంతా వెంటిలేషన్‌పై చికిత్స తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంక్ లీకేజీ ఘటనపై దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు.
" మాకు అందిన సమాచారం ప్రకారం నాసిక్‌లోని ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేసే ట్యాంకు లీకేజీకి గురైనట్లు గుర్తించాం. వారి మృతికి ఆక్సిజన్ ట్యాంక్ లీకేజీనే కారణంగా భావిస్తున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. దర్యాప్తు చేపడతాం. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రకటన విడుదల చేస్తాం. "
- రాజేశ్ తోపే, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి.
ఆక్సిజన్ ట్యాంక్ లీకేజీతో వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ప్రాణవాయువు సరఫరాలో అంతరాయంతోనే 22 మంది మృతి చెందినట్లు వెల్లడించారు నాసిక్ కలెక్టర్ సూరజ్ మంధేర్. లీకేజీ అయిన వెంటనే ఇతర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
బుధవారం ఉదయం జరిగిన ఆక్సిజన్ ట్యాంక్ లీకేజీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమ బంధువుల మృతికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయమే కారణమని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.