కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాకు చెందిన ఇద్దరు రైతు సోదరులు తాము పెంచుకున్న ఎద్దును ఏకంగా రూ.14 లక్షలకు అమ్మేశారు. ఏడాది క్రితం రూ.5 లక్షలకు కొన్న ఈ ఎద్దును ఇంత పెద్ద మొత్తంలో విక్రయించటం వల్ల ప్రస్తుతం చుట్టుపక్కల వారందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. బాగల్‌కోట్ జిల్లాలోని మెటగుడ్డ హలకి గ్రామానికి చెందిన కాశిలింగప్ప గడదర, యమనప్ప గడదర అనే ఇద్దరు అన్నదమ్ములు సంవత్సరం కిందట రూ.5 లక్షల రూపాయలకు ఈ ఎద్దును రాద్యరట్టి గ్రామంలో కొన్నారు. ప్రస్తుతం దీనిని నందగావ్ గ్రామానికి చెందిన విఠ్ఠల అనే పాడి రైతుకు విక్రయించారు.
రూ.14 లక్షలకు అమ్ముడుపోయిన ఎద్దు.. కన్నీటితో సాగనంపిన గ్రామస్థులు
కర్ణాటకలో ఓ ఎద్దును ఏకంగా రూ.14 లక్షలకు అమ్మి వామ్మో అనేలా చేశారు ఇద్దరు రైతు సోదరులు. సంవత్సరం క్రితం రూ.5 లక్షలకు కొనుగోలు చేసిన ఈ ఎద్దు ద్వారా బాగానే ఆదాయాన్ని సంపాదించారు. ప్రస్తుతం దీనిని ఇంత భారీ మొత్తానికి అమ్మడం వల్ల అందరూ ఈ ఎద్దు గురించే చర్చించుకుంటున్నారు.
వృషభం తెచ్చిపెట్టిన ఖజానా..!
ఈ ఎద్దు ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్రలో జరిగిన అనేక ఎడ్ల బండ్ల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి పలు బహుమతులనూ గెలుచుకుంది. 6 బైక్లు, 5 తులాల బంగారంతో పాటు సుమారు రూ.12 లక్షలు నగదు ఈ వృషభం కారణంగానే రైతు సోదరులకు దక్కాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు దీనిపై ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. రూ.14 లక్షలకు ఎద్దును కొనుగోలు చేసిన రైతు దగ్గరకు పంపించే ముందు గ్రామస్థులు దీనికి హారతులు ఇచ్చి మరీ భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.
గతేడాది ఈ సమయంలోనే ఇదే జిల్లాకు చెందిన ఓ రైతు తాను పెంచుకున్న రాజా అనే ఎద్దును రూ.13.5 లక్షలకు విక్రయించి వార్తల్లో నిలిచాడు. ఆ ఎద్దు కూడా చాలాసార్లు పోటీల్లో పాల్గొని అవార్డులను గెలుచుకుంది.