కేంద్రం అమలు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న 'దిల్లీ చలో' అందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. శనివారం నాటికి భారీ సంఖ్యలో రైతులు దిల్లీలోని బురారీ మైదానానికి చేరుకున్నారు. దిల్లీ సమీప ప్రాంతాల్లోనూ రైతులు భారీగా తరలి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశరాజధాని నడిబొడ్డులో బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలన్న డిమాండును పునరుద్ఘాటించారు. అంతవరకు శివారుల్లో ధర్నా చేస్తామని చెబుతూ వంటావార్పూ ఆందోళన చేపట్టారు. ఉత్తర దిల్లీలోని బురాడీలో ఉన్న సంత్ నిరంకారీ మైదానంలో సభ జరుపుకోవాలన్న అధికారులను సూచనను తిరస్కరించారు. పంజాబ్, హరియాణాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు సింఘు, టిక్రి సరిహద్దుల్లోనే మూడో రోజూ కూడా బైఠాయించారు. హరియాణాకు చెందిన రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు. వారంతా శంభు సరిహద్దుకు చేరుకోనున్నారు. సింఘులో ఆదివారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని, అందులో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని జలంధర్‌కు చెందిన రైతు నాయకుడు బల్జీత్ సింగ్ మహల్ తెలిపారు. సంత్ నిరంకారీ మైదానానికి చేరుకున్న ఇంకొందరు రైతులు అక్కడ కూడా ఆందోళన చేస్తున్నారు.
స్పందించిన అమిత్ షా
రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. డిసెంబర్ 3లోపు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో చర్చలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన షా.. వీలైనంత త్వరగా ఈ చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. షా నిర్ణయాన్ని ఆహ్వానించాలని, వీలైనంత త్వరగా రైతులు బురారీకి చేరుకోవాలని అమరీందర్ కోరారు.
ఆరంభం నుంచి సాగిందిలా..
శుక్రవారం రైతులపై భాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. వారిని 'దిల్లీ చలో' ర్యాలీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులు కూడా పోలీసులపై రాళ్లు రువ్వారు. శనివారం రోజుకి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. కానీ, 'దిల్లీ చలో'లో పాల్గొనేందుకు పంజాబ్-హరియాణా సరిహద్దులోని సంబాలో భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, బస్సుల్లెక్కి దిల్లీవైపు సాగుతున్నారు. కేంద్రం వ్యవసాయ చట్టాల అమలును వెనక్కుతీసుకోకపోతే ఆందోళనను ఆపబోమని స్పష్టం చేశారు.
దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీకి భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో, ట్రక్కుల్లో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించారు.
బురారీ గ్రౌండ్‌కి వెళ్లకుండానే!
బురారీ గ్రౌండ్‌కు వెళ్లకుండానే తాము నిరసన కొనసాగిస్తామని పంజాబ్‌కు చెందిన రైతు సంఘం భారతీయ కిసాన్ యూనియన్ స్పష్టం చేసింది. టిక్రీలో సైతం ఇదే వైఖరి కొనసాగుతోంది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్ సరిహద్దులోనూ చాలా మంది రైతులు చలో దిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ రైతులు రోడ్లపై బైఠాయించారు.