దేశంలో ఇప్పటివరకు 90 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్రం తెలిపింది. టీకా తీసుకున్న వారిలో ఏ ఒక్కరిలోనూ తీవ్ర ప్రతికూలతలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి మన్దీప్ భండారీ పేర్కొన్నారు.
టీకా పంపిణీ వివరాలు ఇలా..
- మొత్తం అందించిన టీకా డోసులు 91,86,757. అందులో ఆరోగ్య సిబ్బంది 65,21,785 మంది కాగా, 26,64,972 మంది కరోనా యోధులు టీకా తీసుకున్నారు.
- ఆరోగ్య సిబ్బందిలో 61,79,669 మంది మొదటి డోసు టీకా తీసుకోగా.. 3,42,116 మందికి రెండో డోసు టీకా అందించారు.
- కోవిన్ యాప్లో 68.5 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
- బుధవారం 1,87,527 మంది టీకా తీసుకున్నారు.
- టీకా తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరినవారు 0.0004 శాతం మాత్రమే.
- మొత్తం 37 మంది ఆసుపత్రిలో చేరగా.. చికిత్స తర్వాత 23 మంది కోలుకున్నారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. 12 మంది మృతిచెందారు.
- వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం.. ఇతరత్రా వ్యాధులతో ఇప్పటివరకు 29 మంది మరణించారు. ఇది టీకా తీసుకున్నవారిలో 0.0003 శాతం మాత్రమే.