దేశవ్యాప్తంగా 888కిపైగా రహదారుల ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మాణ దశలోనే ఉన్నట్లు జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖకు పార్లమెంటరీ కమిటీ నివేదించింది. కొత్త ప్రాజెక్టులు ప్రకటించే బదులు.. నిర్మాణ దశలో ఉన్న రహదారులను పూర్తి చేయాలని సూచించింది.
కేంద్రం లెక్కల ప్రకారం..
జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 62,15,797 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం విస్తరించి ఉంది. వీటిలో 1,36,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు. భారత్‌లో ఇప్పటికీ చాలా ప్రాంతాలకు రోడ్డు మార్గం లేదు. నిర్దేశించిన సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవటం ప్రధాన సమస్యగా ఉంది. చాలా చోట్ల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి.
888 ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే
పార్లమెంటరీ కమిటీ అందించిన సమాచారం ప్రకారం.. 2020-21 నాటికి 888 రహదారి ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద రూ. 3,15,373.30 కోట్ల వ్యయంతో 27,665.3 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. దమన్ దీవ్, డయ్యూ మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యంగానే జరుగుతున్నాయి. జాప్యం కారణంగా ప్రజల సమయం, డబ్బు వృథా అవుతోంది. అంతేకాక రోజురోజుకూ ప్రాజెక్టు వ్యయం సైతం పెరుగుతోందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రాజెక్టులు- సవాళ్లు
నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి సవాల్‌గా మారాయి. వీటిపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని కమిటీ సిఫార్సులు చేసింది. రోడ్డు నిర్మాణ రంగానికి అధిక నిధులు కేటాయించాలని సలహా ఇచ్చింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) వ్యయం పెరుగుతున్నా.. ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు తగ్గటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.