తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బర్డ్ ఫ్లూ కలకలం! ఒడిశాలో 700 కోళ్లు మృతి - Bird Flu 2021

మధ్యప్రదేశ్​లో మొత్తం ఎనిమిది జిల్లాలకు బర్డ్ ఫ్లూ వ్యాపించింది. నీముచ్, ఇందోర్ మార్కెట్లలో వైరస్​ను గుర్తించారు. మరోవైపు, ఒడిశాలో 700 కోళ్లు, రాజస్థాన్, యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కాకులు మరణించాయి. వీటి నమూనాలను పరీక్షల కోసం పంపించారు అధికారులు. బర్డ్ ఫ్లూ వల్లే ఇవి మరణించాయా అన్న విషయం ఇంకా నిర్ధరణ కాలేదు.

over-700-chickens-were-found-dead-at-the-farm-in-odishas-badaberana
బర్డ్ ఫ్లూ కలకలం! ఒడిశాలో 700 కోళ్లు మృతి

By

Published : Jan 7, 2021, 8:24 PM IST

దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పక్షులు మరణించడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీలో పక్షులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నాయి.

కొత్త కేసులు

మధ్యప్రదేశ్​లోని నీముచ్, ఇందోర్​ మార్కెట్లలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో బర్డ్ ఫ్లూను గుర్తించామని స్పష్టం చేశారు.

మరోవైపు, రాజస్థాన్ జోధ్​పుర్ జిల్లా​లోని సెత్రావా, ఫలోదీ ప్రాంతాల్లో యాభై కాకులు మృత్యువాత పడ్డాయి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో.. మరణించిన కాకుల నమూనాలను పరీక్షల కోసం పంపించారు అధికారులు. అనంతరం కాకుల మృతదేహాలను ఖననం చేసినట్లు తెలిపారు. ఫలోదీ సరస్సు వద్ద ఇదివరకే పదుల సంఖ్యలో కాకులు మరణించాయని అధికారులు వెల్లడించారు. జోధ్​పుర్ నుంచి పంపిన నమూనాల్లో బర్డ్ ఫ్లూ లేదని స్పష్టం చేశారు.

ఫలోదీ ప్రాంతంలోకి కుర్జన్ పక్షులు వలస వచ్చే సమయంలోనే కాకులు వరుసగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఒక్క కుర్జన్ పక్షి కూడా వ్యాధుల కారణంగా మరణించలేదని పక్షి సంరక్షుకుడు సెవరామ్ మాలి తెలిపారు. విద్యుదాఘాతం వల్ల రెండు పక్షులు చనిపోయాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో పశుసంవర్థక, అటవీ, వైద్య శాఖల అధికారులతో జోధ్​పుర్ డివిజనల్ కమిషనర్ రాజేష్ శర్మ సమావేశమయ్యారు. పరిస్థితిని నియంత్రించేందుకు వారం రోజుల్లోగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు శాఖలకు చెందిన అధికారులతో డివిజన్లవారీగా నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు, స్థానిక సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేశారు.

700 కోళ్లు మృతి

మరోవైపు, ఒడిశా ఖోర్దా జిల్లా బదబెరేనా గ్రామంలోని ఓ ఫాంలో 700కు పైగా కోళ్లు చనిపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు, ఇదే ప్రాంతంలో పదుల సంఖ్యలో కోళ్ల మృతదేహాలు కనిపించాయని వెల్లడించాయి. పక్షుల మృతికి గల కారణాలను అధికారులు ఇంకా కనుగొనలేదు. దీనిపై దర్యాప్తు కోసం వెటర్నరీ డాక్టర్​లు ఈ ప్రాంతాన్ని సందర్శించలేదని సమాచారం.

మరోవైపు, రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు గుర్తించలేదని బుధవారం ఒడిశా ముఖ్యకార్యదర్శి సురేష్ చంద్ర మోహపాత్ర స్పష్టం చేశారు. 11 వేల శాంపిళ్లను పరీక్షించామని, ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని వెల్లడించారు. వైరస్​ను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తే.. నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ పరిస్థితుల్లో ఖుర్దా, భువనేశ్వర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. బర్డ్ ఫ్లూ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తోంది.

యూపీలోనూ

ఉత్తర్​ప్రదేశ్​లోని సోన్​భద్ర జిల్లాలోనూ కాకులు మరణించాయి. తొమ్మిది కాకులు చనిపోయినట్లు అధికారులు బుధవారం సాయంత్రం గుర్తించారు. అయితే తీవ్రమైన చలి వల్లే పక్షులు మృతిచెంది ఉంటాయని సోన్​భద్ర చీఫ్ వెటర్నరీ అధికారి ఏకే శ్రీవాస్తవా పేర్కొన్నారు. రెండు కాకుల నమూనాలను ఫ్లూ పరీక్షల నిమిత్తం భోపాల్​కు పంపినట్లు తెలిపారు. ఇప్పటివరకైతే జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించలేదని స్పష్టం చేశారు.

కర్ణాటకలో ఆరు కాకులు మృతి

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సరిహద్దులో కాకుల మృతదేహాలు గుర్తించారు అధికారులు. ఆరు కాకులు మరణించినట్లు తెలిపారు. నమూనాలను పరీక్షల కోసం పంపించారు. కేరళలో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్ర వైద్య శాఖతో చర్చించి తగిన కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

హై అలర్ట్

ఇప్పటివరకు రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్ విధించారు. కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసుల కారణంగా.. 69 వేల పక్షులను వధించారు. ఇందులో ఎక్కువ శాతం కోళ్లు, బాతులే ఉన్నాయి. హరియాణాలోనూ పెద్ద సంఖ్యలో పౌల్ట్రీ పక్షులు మరణిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. జమ్ము కశ్మీర్​లోని మంద డీర్ పార్క్​లో పక్షులకు అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని పక్షుల నమూనాలు సేకరించి జలంధర్​లోని ల్యాబ్​కు పంపిస్తున్నారు.

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details