దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిత్యం దాదాపు సరాసరి 30లక్షలకుపైగా కరోనా డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 40కోట్ల 31లక్షల డోసులను అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సమకూర్చామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఇప్పటిదాకా 39కోట్ల డోసులను పంపిణీ చేయగా.. మరో 1.92 కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. వీటికితోడు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తు చేసింది. మరో 83లక్షల డోసులు రాష్ట్రాలకు చేరే మార్గంలో ఉన్నాయని తెలిపింది.
ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ను వేగంగా చేపట్టేందుకు జూన్ 21 నుంచి కేంద్ర ప్రభుత్వం మెగా డ్రైవ్‌ను ప్రారంభించింది. అప్పటినుంచి రోజువారీగా సరాసరి 40లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు. మెగాడ్రైవ్ ప్రారంభంలో నిత్యం 80లక్షల డోసులు అందించినప్పటికీ.. ప్రస్తుతం అది 35లక్షలకు తగ్గింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్నామని.. ఎక్కువ మొత్తంలో డోసులను సరఫరా చేయాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి విమర్శలను కేంద్ర ఆరోగ్యశాఖ తోసిపుచ్చుతోంది. దేశంలో కొవిడ్ టీకాల కొరత లేదని.. కేవలం వ్యాక్సిన్ పంపిణీ నిర్వహణలోనే రాష్ట్రాలు విఫలం అవుతున్నాయని స్పష్టం చేసింది.