ప్రపంచాన్ని కరోనా కమ్మేసిన వేళ ఇల్లే ప్రపంచంగా బతికే పడతులపై వారి భాగస్వాములు ఇష్టారీతిన గృహహింసకు పాల్పడుతున్నట్లు తేలింది. దేశంలోని ప్రతి 20 మంది వివాహితుల్లో ఐదుగురు తమ భాగస్వామి నుంచి శారీరక, లైంగికపరమైన హింసను అనుభవిస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 స్పష్టం చేసింది. కొవిడ్-19 మహమ్మారి కాలంలో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు, ఎన్జీఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ప్రధానంగా కర్ణాటక, అసోం, మిజోరం, తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లో పడతులు ఎక్కువగా హింసకు గురవుతున్నట్లు సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6.1 లక్షల మంది గృహిణులను వారి ఆరోగ్యం, కుటుంబనియంత్రణ, పోషకాహారం తదితరాలపై ప్రశ్నించినట్లు సర్వే సంస్థలు తెలిపాయి.
ఏ రాష్ట్రంలో ఎంత శాతం?
కర్ణాటకలో 18 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో 44.4 శాతం మంది మహిళలు గృహహింసకు గురవుతున్నట్లు తెలిపారు. 2015-16 లో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో ఇది 20.6 శాతం మాత్రమే ఉంది. బిహార్‌లో 40 శాతం మహిళలు, మణిపూర్‌లో 39 శాతం, తెలంగాణలో 36.9 శాతం, అసోంలో 32 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 30 శాతం గృహిణులు తమ జీవితభాగస్వామి నుంచి శారీరక, లైంగిక పరమైన హింసను ఎదుర్కొంటున్నట్లు సర్వే పేర్కొంది.
మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించగా.. గత సర్వేతో పోల్చితే అసోం, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, సిక్కిం, జమ్ము-కశ్మీర్, లద్ధాఖ్ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 18 నుంచి 49 ఏళ్ల వయసున్న గృహిణులపై భాగస్వాముల దాడులు పెరిగినట్లు తేలింది. మరో 9 రాష్ట్రాల్లో 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న మహిళలపై వారి భాగస్వాముల నుంచి లైంగికదాడులు పెరిగినట్లు తేలింది.
కఠిన చర్యలు తీసుకోవాలి
నిరక్షరాస్యత సహా మద్యపానం కారణంగా ఎక్కువ మంది మహిళలు గృహ హింసకు గురవుతున్నారని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. కొవిడ్-19 సమయంలో ఇది మరింతగా పెరిగిపోయిందని.. ఎన్ఎఫ్హెచ్ఎస్-4తో ఎన్ఎఫ్హెచ్ఎస్-5ని పోల్చి చూస్తే అర్థమవుతుందని వారు అంటున్నారు. కరోనా కేసులతో పాటు గృహహింస ఘటనలూ పెరిగిపోతున్నాయని.. గృహహింసను ఒక ప్రజారోగ్య విషయంగా చూడాలని స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి. గృహహింస ఘటనలపై ప్రభుత్వం ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి ఉందని.. అత్యవసర విషయంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కొందరు పేర్కొంటున్నారు. భార్య భర్తపై ఆధారపడటం వల్ల ఆమెపై సర్వ హక్కులు ఉన్నాయన్న భావనలో పురుషులు ఉంటున్నారని.. ఆ భావనను మార్చాల్సి ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందంటున్నారు.
ఇదీ చూడండి:'మళ్లీ నిరాహార దీక్ష చేస్తా'- హజారే హెచ్చరిక