దేశంలోని యువతకు నైపుణ్యాలు పెంపొందించి వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం(Skill India) ద్వారా జనవరి 19, 2021 వరకు 1.07 కోట్ల మందికి శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. 40 కోట్ల మందికి శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా దాదాపు ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకం తొలిదశలో ఎంత మేరకు యువతకు ఉపయోగపడిందనే విషయాన్ని పరిశీలిస్తే..
షార్ట్ టెర్మ్ శిక్షణ ద్వారా యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలు పొందించేందుకు 2015 జులై 15న అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై)' పథకాన్ని తీసుకొచ్చింది. 2022 నాటికి దేశ వ్యాప్తంగా 40 కోట్ల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సౌలభ్యం కోసం దీనిని పీఎంకేవీవై 2.0, ( 2016-2020) పీఎంకేవీవై 3.0 (2020-2021) అని విభజించింది.తాజాగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 19 నాటికి 1.07 కోట్ల మంది యువత నైపుణ్య శిక్షణ తీసుకోగా.. అందులో 46.27 లక్షల మందికి షార్ట్ టెర్మ్, మరో 46.27 లక్షల మందికి ఓరియెంటేషన్ శిక్షణ ఇచ్చారు. మరోవైపు శిక్షణ పొందిన వారిలో 19 లక్షల మందికి ఉపాధి లభించినట్టు కేంద్రం చెబుతోంది.