Anthrax in Kerala: కేరళలోని అథిరాపల్లి అటవీ ప్రాంతంలో ఆంత్రాక్స్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇటీవల అడవి పందులు వరుసగా మృత్యువాత పడటాన్ని గమనించిన అధికారులు.. వాటి నమూనాలను పరీక్షలకు పంపారు. అడవి పందులు ఆంత్రాక్స్‌తోనే చనిపోయినట్లు నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
అథిరాపల్లి అటవీ ప్రాంతంలోని కొన్ని అడవి పందుల్లో ఆంత్రాక్స్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అయితే ఆంత్రాక్స్ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అడవి పందులతో పాటు ఇతర జంతువులు మూకుమ్మడిగా మృత్యువాత పడితే.. అధికారులకు సమాచారం అందిచాలని, ప్రజలకు అలాంటి ప్రదేశాలకు వెళ్లవద్దని సూచించారు. ఆంత్రాక్స్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. పశువులకు టీకాలు వేసే సమయంలో ఆంత్రాక్స్ నివారణ చర్యలపై అవగాహన కల్పించేదుకు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.