సామాజిక మాధ్యమాల్లో సమాచార నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన నూతన నియమావళిపై రాజకీయంగా దుమారం చెలరేగింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలింగించేలా ఈ మార్గదర్శకాలు ఉన్నాయని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఇలాంటి చర్యలను తాము ఎంత మాత్రం సహించబోమని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ తెలిపారు.
"చిన్నారుల అశ్లీలం వంటి అసభ్యకరమైన వాటిని సామాజిక మాధ్యమాల్లో నియంత్రించే ఈ చర్యలు స్వాగతించదగినవే. కానీ, ఈ మార్గదర్శకాలను చూస్తోంటే.. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశ ద్రోహ ఆరోపణలు మోపుతూ ప్రభుత్వం ఆ స్వేచ్ఛను అరికట్టేందుకు యత్నిస్తూనే ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే మేం ఎంత మాత్రం సహించం.
-సుప్రియా శ్రీనేట్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
సామాజిక మాధ్యమ సంస్థలు ఏమన్నాయంటే..
ఈ తాజా నియమావళిని సామాజిక మాధ్యమ సంస్థలు స్వాగతించాయి. అంతర్జాల సవాళ్లను పరిష్కరించేందుకు నిర్దేశించిన మార్గదర్శకాలకు తాము ఎల్లప్పుడూ మద్దతిస్తామని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ తెలిపింది. ఈ కొత్త నియమాలను తాము నిశితంగా అధ్యయనం చేస్తామని చెప్పింది. వినియోగదారులకు సురక్షితమైన సేవలందించేందుకు కట్టుబడి ఉంటామని, భారత్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్లో తాము భాగస్వాములవుతామని పేర్కొంది.
తాజా మార్గదర్శకాలపై గూగుల్, ట్విట్టర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇంటర్మీడియరీస్ బాధ్యతలను స్పష్టం చేయడంలో కొత్త మార్గదర్శకాలు సాయపడతాయని 'కూ' సంస్థ పేర్కొంది. వినియోగదారుల ఆసక్తిని కాపాడేందుకు దోహదపడతాయని తెలిపింది. ఫిర్యాదు అందిన కంటెంట్ మూలాలను గుర్తించడంలో కొత్త మార్గదర్శకాలు పని చేస్తాయని ఇండియాటెక్.ఓఆర్జీ సీఈఓ రమీశ్ కైలాసం తెలిపారు.