Orphan Loan: కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ బాలికను అప్పులు వేధిస్తున్నాయి. తన తండ్రి ఇంటి కోసం తీసుకున్న రుణం చెల్లించాలంటూ ఎల్ఐసీ ఆమెకు నిత్యం నోటీసులు జారీ చేస్తోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ బాలిక తనకు కొంత సమయం ఇవ్వాలంటూ ఎల్‌ఐసీని వేడుకుంది. ఈ విషయం తెలుసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన 17ఏళ్ల వనిశా పాఠక్ తల్లిదండ్రులు గతేడాది మే నెలలో కరోనా కారణంగా మృతిచెందారు. దీంతో వనిశా, 11 ఏళ్ల ఆమె తమ్ముడు అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరిద్దరూ మేనమామ సంరక్షణలో ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాధను దిగమింగుకుని వనిశా.. గతేడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో 99.8శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. కాగా.. వనిశా తండ్రి జితేంద్ర పాఠక్ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసేవారు. సొంతింటి కోసం జితేంద్ర గతంలో ఎల్‌ఐసీ నుంచి లోన్ తీసుకున్నారు. అయితే జితేంద్ర మరణించినప్పటి నుంచి రూ.29లక్షల రుణం తిరిగి చెల్లించాలంటూ ఎల్‌ఐసీ.. వనిశాకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. లోన్ కట్టకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వనిశా, ఆమె తమ్ముడు మైనర్లు కావడం వల్ల జితేంద్ర పేరు మీద ఉన్న కమిషన్లు, సేవింగ్స్, పాలసీలను ఎల్‌ఐసీ బ్లాక్ చేసింది. వనిశాకు 18ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్ అన్నీ ఆమె చేతికి రానున్నాయి. అప్పటిదాకా తనకు సమయం ఇవ్వాలని, తండ్రి పేరు మీద ఉన్న ఆస్తులు వచ్చాక లోన్ చెల్లిస్తానని వనిశా.. ఎల్‌ఐసీకి లేఖ రాసింది. కానీ అటు వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.