అభంశుభం తెలియని ఆ చిన్నారులను విధి వంచించింది. లాలించి పెంచాల్సిన అమ్మానాన్నాలు కరోనాతో తిరిగి రాని లోకాలకు వెళ్లారు. దీంతో ఉన్న చిట్టి తమ్ముడు బాధ్యతను భుజాలపైకెత్తుకుంది ఏడేళ్ల చిన్నారి. తమ్ముడి బాధ్యతను ఓ కన్న తల్లిలా ఆకలింపు చేసుకుని ఆలనా పాలనా చూస్తూ అమ్మలేని లోటును తీరుస్తోంది. ఈ దృశ్యాలు ఒడిశా బాలేశ్వర్ జిల్లా నిమత్పుర్లో కనిపిస్తున్నాయి.
ఏం జరిగిందంటే..
కమలేశ్ పాండా, స్మిత దంపతులు. బాలేశ్వర్ జిల్లా భోగరాయ్ మండలం నిమత్పుర్లో నివాసముంటున్నారు. కమలేశ్(36) భువనేశ్వర్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తుండగా.. అతని భార్య స్మిత(28) కటక్‌లోని ఆచార్య హరిహర కేన్సర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గర్భిణీ అయిన స్మితకు ఏప్రిల్ 15న కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో కటక్‌లోని ఎస్సీబీ కొవిడ్ వార్డులో చేరారు. శిశువుకు జన్మనిచ్చిన వారం రోజులకే వైరస్‌తో స్మిత మృతిచెందారు. ఆ తర్వాత కమలేశ్ కూడా కొవిడ్ బారిన పడ్డారు. ఆయన భువనేశ్వర్‌లోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.