Organ Donation In Kerala : కేరళ కోజికోడ్‌లోని కొట్టూర్ గ్రామానికి చెందిన మహిళలు.. స్ఫూర్తివంతమైన ముందడుగు వేశారు. మరణాంతరం తమ అవయవాలు ఇతరులకు ఉపయోగపడేలా చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 5 వేల మంది మహిళలు అవయవదానానికి అంగీకారం తెలిపారు. రానున్న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సంబంధిత అధికారులకు.. అంగీకార పత్రాలు సమర్పించనున్నట్లు సదరు మహిళలు తెలిపారు. కాగా ఈ మహత్తర కార్యక్రమానికి కొట్టూర్ గ్రామం కుటుంబశ్రీ కమ్యునిటీ డెవలప్మెంట్ సొసైటీ ఈ శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సంస్థే కుటుంబశ్రీ. ఒక్కో కుటుంబశ్రీ యూనిట్లో 20 మంది మహిళలు సభ్యులుగా ఉంటారు. ఇందులో భాగంగా కొట్టూర్ కుటుంబశ్రీ కమ్యునిటీ డెవలప్మెంట్ సొసైటీ (సీడీఎస్) ఆధ్వర్యంలో మొదటి దశలో సీడీఎస్ సభ్యులకు స్థానిక ఎల్పీ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని అన్ని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. గ్రామాన్ని సంపూర్ణ అవయవదాన పంచాయతీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు.
సీడీఎస్ ఛైర్పర్సన్ షీనా యూఎం, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సీహెచ్ సురేశ్, కో ఆర్డినేటర్ సీకే వినోదన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. కుటుంబశ్రీ 25వ వార్షికోత్సవం సందర్భంగా, పంచాయతీ అధికారుల సహాయంతో 19 వార్డుల్లో కో ఆర్డినేటర్లను నియమించి ప్రచారం విస్తృతం చేస్తున్నారు. జూన్ 25 నుంచి జూలై 5 వరకు కార్యకలాపాలు చేపట్టనున్నట్లు తెలిపారు.