తమిళనాడు అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ పొరపొచ్చాలు మొదలయ్యాయి. పార్టీ అగ్రనేతలైన పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలు తలెత్తాయి. తమిళనాడు అసెంబ్లీలో డిప్యూటీ లీడర్ పదవిని పన్నీర్‌సెల్వం తిరస్కరించారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సోమవారం సమావేశం జరగగా... మాజీ స్పీకర్ పీ ధనపాల్‌ను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని పన్నీర్‌సెల్వం ప్రతిపాదించారు. అయితే ఈ ప్రయత్నం విఫలమైందని పార్టీకి చెంది ఓ ఎమ్మెల్యే చెప్పారు. 66 మంది ఎమ్మెల్యేలలో 61 మంది పళనిస్వామికి మద్దతిచ్చారని... దీంతో పన్నీర్‌సెల్వం వెంటనే పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారని తెలిపారు. పార్టీలో తన స్థానంపై వాస్తవాన్ని గ్రహించాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారని ఆ ఎమ్మెల్యే వెల్లడించారు.
పార్టీలో తన స్థానం విషయంలో వెనక్కి తగ్గరాదని పన్నీర్‌సెల్వం అనుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. డిప్యూటీ లీడర్ స్థానాన్ని తిరస్కరించడమే ఇందుకు సూచన అని చెబుతున్నారు. పార్టీలో తిరుగుబాటు మొదలయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. చీలిక వచ్చినా ఆశ్చర్యం లేదని జోస్యం చెబుతున్నారు.
అప్పటి నుంచే ఇలా..
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో మొదలైన ఈ రగడ ఇప్పటికీ సద్దుమణగలేదు. భాజపా అధినాయకత్వం జోక్యం చేసుకొని పన్నీర్‌సెల్వం, పళనిస్వామితో చర్చలు జరిపినప్పటికీ.. అది తాత్కాలికమేనని అర్థమవుతోంది. పైకి బాగానే ఉన్నా.. పార్టీలో మాత్రం అభిప్రాయభేదాలకు కొదవ లేదని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవేవీ పెద్దగా బయటకు రాలేదు. తాజా ఎన్నికల్లో ఓటమిపాలు కావడం, తేవర్ వర్గంలో పట్టు కోల్పోవడం వంటి పరిణామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేకు బలమైన కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులో తేవర్ వర్గం ఓట్లు.. అన్నాడీఎంకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే మధ్య చీలిపోయాయి. ఈ ప్రభావంతో అనేక స్థానాలను డీఎంకేకు కోల్పోవాల్సి వచ్చింది.